దశాబ్ది సంబరం.. నేడు సాగునీటి దినోత్సవం
సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మననం చేసుకుంటారు. భవిష్యత్తులో తెలంగాణ సాధించబోయే విజయాలకు ఈ సాగునీటి దినోత్సవం ప్రేరణగా నిలుస్తుంది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఆరో రోజుకి చేరుకున్నాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరవుతారు.
అప్పుడు-ఇప్పుడు..
తెలంగాణ ఏర్పడక ముందు, ఆ తర్వాత.. స్పష్టమైన తేడా కనిపించే విషయాల్లో సాగునీటి రంగం ప్రథమ స్థానంలో ఉంది. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త ప్రాజెక్ట్ లు, సమగ్ర నీటి ప్రణాళికతో ఆయకట్టు 119 శాతం పెరిగింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు సాగునీటిరంగంలో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో చెప్పడానికి.
6 అంచెల వ్యూహం..
తెలంగాణలో నీటిపారుదల రంగాన్ని బలోపేతం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం 6 అంచెల వ్యూహాన్ని అమలు చేసింది.
- నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్ట్ లను త్వరగా పూర్తి చేయడం
- నాగార్జున సాగర్, నిజాం సాగర్, శ్రీ రామ్ సాగర్ వంటి పాత ప్రాజెక్ట్ లను దశలవారీగా ఆధునీకరించడం.
- మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, జలవనరుల పునరుద్ధరణ.
- ప్రాజెక్ట్ కమాండ్ ఏరియాలలో వాగులు, నదుల పునరుజ్జీవనం కోసం తూములు, చెక్ డ్యామ్ ల నిర్మాణం.
- పాలమూరు రంగారెడ్డి, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టాలెక్కించడం.
- నీటిపారుదల వ్యవస్థలను సమర్థంగా నిర్వహించడం.
2014కి ముందు తెలంగాణలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పై చేసిన వ్యయం కేవలం రూ. 38,405.12 కోట్లు కాగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ వ్యయం రూ. 1,55,210.86 కోట్లకు పెరిగింది. తద్వారా 5.71 లక్షల ఎకరాలకు అందుతున్న నీటిపారుదల ఇప్పుడు 17.23 లక్షల ఎకరాలకు చేరింది. రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగి కొత్త రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధ్యమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరంను రికార్డ్ సమయంలో నిర్మించడం ద్వారా ప్రాజెక్టు కింద 19.63 లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టించారు. 18.83 లక్షల ఎకరాలను స్థిరీకరించేందుకు ప్రణాళికలు రచించారు. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరించి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 3 ఆనకట్టలు, 22 లిఫ్టులు, 21 భారీ పంపుహౌస్ లు, 15 రిజర్వాయర్లు 203 కిలోమీటర్ల మేర సొరంగమార్గాలు, 1531 కిలోమీటర్ల పొడవున కాల్వలు, 36 నెలల స్వల్ప వ్యవధిలో నిర్మించారు. సముద్ర మట్టం నుండి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలు ఎత్తిపోస్తున్నారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకానికి సైతం కాళేశ్వరం జలాలను ఉపయోగిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, భక్త రామదాసు తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దేవాదుల తుపాకుల గూడెం సమ్మక్క-సారక్క ప్రాజెక్టు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మిషన్ కాకతీయ
తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ, పూడిక తీతతో భూగర్భ జలాలు పెరిగాయి. దాదాపు 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 46,531 చెరువుల్లో పూడిక తొలగించి, తూములను, కట్టలను పటిష్టంగా నిర్మించడం కోసం ప్రభుత్వం రూ. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 3,825 కోట్లతో 1200 చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టింది. వీటిలో మొదటి దశ 650 చెక్ డ్యాంలు పూర్తయ్యాయి. మిగతా చెక్ డ్యాముల పనులు పురోగతిలో ఉన్నాయి.
సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మననం చేసుకుంటారు. భవిష్యత్తులో తెలంగాణ సాధించబోయే విజయాలకు ఈ సాగునీటి దినోత్సవం ప్రేరణగా నిలుస్తుంది.