Telugu Global
Telangana

ఢిల్లీ, ఉజ్జయిని నగరాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది.

ఢిల్లీ, ఉజ్జయిని నగరాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
X

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 2న ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలు ప్రారంభిస్తారు.

సచివాలయంలో జరుగనున్న వేడుకల కోసం అన్ని శాఖల నుంచి 7,252 మంది అధికారులను ఆహ్వానించారు. వారి కోసం 151 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. దశాబ్ది ఉత్సవ వేడుకల ఏర్పాట్ల కోసం 13,398 మంది అధికారులను శాఖల వారీగా నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మధ్యప్రదేశ్‌లో అధికారికంగా..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. మహాకాల్ ఉజ్జయిని నగరంలో జూన్ 2న ఆ రాష్ట్ర గవర్నర్ మంగుబాయి పటేల్ అధ్యక్షతన వేడుకలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ పొల్గొననున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి ట్విట్టర్‌లో తెలిపారు. ఆయన స్వస్థలం పెదపల్లి జిల్లా బసంత్‌నగర్ కావడం గమనార్హం. ఈ వేడుకల్లో పాల్గొనడం ఒక తెలంగాణ బిడ్డగా చాలా గర్వంగా ఉందని నరహరి అన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.



ఢిల్లీలో..

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జూన్ 2న ఉదయం 9 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం చేసింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. దీంతో పాటు ఫొటో ఎగ్జిబిషన్, హెల్త్ చెకప్ క్యాంపులు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మందా జగన్నాథం, విశ్రాంత ఐఏఎస్ కేఎం సాహ్ని, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ హాజరుకానున్నారు.

First Published:  1 Jun 2023 2:51 AM GMT
Next Story