Telugu Global
Telangana

దశాబ్ది ఉత్సవాలు.. నేడు సంక్షేమ సంబురాలు

రూపాయి ప్రజల్లో తిరగడం స్పిన్ ఆఫ్ ఎకానమీకి దారితీస్తుంది అని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యం అని రుజువైంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడింది.

దశాబ్ది ఉత్సవాలు.. నేడు సంక్షేమ సంబురాలు
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు తెలంగాణ సంక్షేమ సంబురాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు నిర్వహిస్తారు. సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్ర భారతిలో సభ జరుగుతుంది.

సంక్షేమంలో పింఛన్లదే అగ్రభాగం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 50 వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు కేటాయిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలను ఆసరా ఫించన్లు, సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రూపాయి ప్రజల్లో తిరగడం స్పిన్ ఆఫ్ ఎకానమీకి దారితీస్తుంది అని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యం అని రుజువైంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడింది. 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోసం గత ప్రభుత్వాలు ఖర్చు పెట్టిన సొమ్ము కేవలం రూ.5,558 కోట్లు. తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వం 2014 నుండి మే 2023 మధ్య తొమ్మిదేళ్ల కాలంలో ఆసరా తదితర పింఛన్ల కోసం రూ. 58,696 కోట్లు ఖర్చు చేసింది. అంటే దాదాపు పదిరెట్లు ఎక్కువ.

సామాజిక పింఛన్లు గతంలో కేవలం వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలకే ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం అందులో అనేక కేటగిరీలను చేర్చింది. వివిధ వర్గాల వారిని, వివిధ రోగాల బాధితులకు కూడా పింఛన్ తో జీవనాధారం చూపించింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఎస్సీలకోసం దళితబంధు, ప్రగతి నిధి, సంక్షేమ హాస్టళ్ల నిర్మాణం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు, ఎస్టీలకోసం టీఎస్ ప్రైడ్, ఉచిత విద్యుత్, గిరిజనుల ఆత్మగౌరవ భవనాలు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, బీసీలకోసం కులాలవారీగా ఆత్మగౌరవ భవనాలు, నేతన్నకు చేయూత, కల్లుగీత కార్మికుల సంక్షేమం, బీసీ స్టడీ సర్కిళ్లు, మైనార్టీలు, క్రైస్తవులు, అగ్రవర్ణాల పేదలకు కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆయా సంక్షేమ కార్యక్రమాల గురించి మరోసారి ప్రజలకు వివరించి అవగాహన పెంచడం, సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారుతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు.

First Published:  9 Jun 2023 8:30 AM IST
Next Story