దశాబ్ది సంబరం.. నేడు పట్టణ ప్రగతి దినోత్సవం
పచ్చదనం పెంపు కోసం మున్సిపాలిటీల బడ్జెట్ ప్రణాళికలలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అర్బన్ మిషన్ భగీరథ ద్వారా పట్టణాలకు మంచినీరు సరఫరా చేస్తోంది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణ ప్రగతి ద్వారా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపేలా ఈరోజు కార్యక్రమాలుంటాయి.
పల్లెలకోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, పట్టణాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. పట్టణ జనాభాకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడంతోపాటు, పరిసరాలు పరిశుభ్రంగా, పచ్చగా మార్చే లక్ష్యంతో "పట్టణప్రగతి" కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలలో అమలు చేస్తోంది. దీనికోసం నూతన మున్సిపల్ చట్టాన్ని రూపొందించడం విశేషం.
కేటాయింపులు ఇలా..
GHMCకి సరిసమానంగా రాష్ట్రంలోని మున్సిపాల్టీలకు కూడా కేటాయింపులు జరపడం విశేషం. ఫిబ్రవరి 2020 నుండి మార్చి 2021 వరకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.148 కోట్లు (మున్సిపాలిటీలకు రూ.70 కోట్లు, GHMCకిరూ.78 కోట్లు) పట్టణప్రగతి కార్యక్రమం కింద విడుదల చేసింది. ఏప్రిల్ 2021 నుండి మార్చి 2022 వరకు ప్రతి నెల రూ. 116 కోట్లు (మున్సిపాలిటీలకు రూ. 53 కోట్లు, GHMCకి రూ. 59 కోట్లు) విడుదల చేసింది.
పచ్చదనం పెంపు కోసం మున్సిపాలిటీల బడ్జెట్ ప్రణాళికలలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రభుత్వం వెజ్, నాన్ వెజ్ సమీకృత మార్కెట్లు నిర్మిస్తోంది. టి.ఎస్.బిపాస్ చట్టం ద్వారా ఇళ్ల నిర్మాణాల అనుమతులు మరింత సులభమయ్యాయి. 75 చదరపు గజాల స్థలంలో నిర్మించే ఇళ్లకు అసలు అనుమతి అవసరం లేకుండా ప్రభుత్వం చట్టంలో మార్పు తెచ్చింది. అర్బన్ మిషన్ భగీరథ ద్వారా పట్టణాలకు మంచినీరు సరఫరా చేస్తోంది.