దళితబంధుపై హైకోర్టులో పిల్.. ఎందుకంటే..?
హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో మరోసారి దళితబంధు వార్తల్లో నిలిచింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కూడా దళిత బంధు నిధులు పెంచి ఇస్తామని ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో ప్రకటించింది. ఎన్నికల వేళ దళిత బంధు తెలంగాణలో హాట్ టాపిక్ కావడం విశేషం.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంపై హైకోర్టులో పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ దాఖలైంది. ఈ పథకం అమలులో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారుల ప్రమేయాన్ని, వారి సిఫారసులు నియంత్రించాలంటూ పిల్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దళిత బంధు లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారనే విషయాన్ని తెలపాలని కోరింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
అందరి దృష్టి దళిత బంధుపై..
దళిత బంధు పథకం ద్వారా ఆ వర్గంలోని పేద కుటుంబాలకు 10లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. కేవలం సాయం చేసి వదిలేయకుండా ఆ కుటుంబ సభ్యులు ఆ 10లక్షలను ఎలా ఖర్చు చేస్తున్నారు, ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటున్నారే విషయాలను కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. స్వయం ఉపాధి కోసం వివిధ పరికరాలు కొనుగోలు చేసే సమయంలో ప్రత్యేక రాయితీలు ఇస్తోంది. వ్యాపారాలను ప్రారంభించేవారికి అదనపు ప్రోత్సాహకాలను ఇస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి 1100 మందికి ఈ ఆర్థిక సాయం అందజేస్తోంది ప్రభుత్వం. లబ్ధిదారుల సంఖ్యను మరింత పెంచుతామని తెలిపింది.
సహజంగా దళిత బంధు అందుకోలేనివారి నుంచి ఈ పథకంపై విమర్శలు రావడం సహజం. అక్కడక్కడా ఇలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి కూడా. విమర్శలకు వెనకడుగు వేయకుండా.. పేద కుటుంబాలకు కచ్చితంగా న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. లబ్ధిదారుల ఎంపికలో చీఫ్ సెక్రటరీకి కూడా విచక్షణాధికారాలు ఇచ్చింది ప్రభుత్వం. హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో మరోసారి దళిత బంధు వార్తల్లో నిలిచింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కూడా దళిత బంధు నిధులు పెంచి ఇస్తామని ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో ప్రకటించింది. ఎన్నికల వేళ దళిత బంధు తెలంగాణలో హాట్ టాపిక్ కావడం విశేషం.
♦