Telugu Global
Telangana

దేశానికే దిక్సూచి.. తెలంగాణ దళిత బంధు

దళిత కుటుంబాలకు చెందిన వారు తమకు నచ్చిన లేదా మొదటి నుంచి చేస్తున్న ఉపాధినే.. సొంతగా ప్రారంభించడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి రూ.10 లక్షలను గ్రాంట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.

దేశానికే దిక్సూచి.. తెలంగాణ దళిత బంధు
X

దళితుల స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిన దళిత బంధు పథకం ఇప్పుడు ఓ గొప్ప విప్లవంగా మారింది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మరెక్కడా లేని అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళిత బంధు రూపొందింది. ఈ పథకం దేశానికే దిక్సూచిలా మారిందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎంతో మంది దళితులు ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి చిన్న పరిశ్రమలు ప్రారంభిస్తూ.. మరి కొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇలాంటి ఉదాహరణలు ఇప్పుడు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయి.

దళిత కుటుంబాలకు చెందిన వారు తమకు నచ్చిన లేదా మొదటి నుంచి చేస్తున్న ఉపాధినే.. సొంతగా ప్రారంభించడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి రూ.10 లక్షలను గ్రాంట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరమే లేదు. అంతే కాకుండా ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా ఏక మొత్తంగా డబ్బును విడుదల చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు దళిత బంధు పథకం ద్వారా రూ.3,832 కోట్లను ఖర్చు చేసింది. రాష్ట్రంలోని 38,323 దళిత కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొంది.. తమకు మేలైన ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ మెరుగైన జీవితాన్ని గడపుతుండటం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దళిత బంధు పథకం ద్వారా భారీగా 1,77,000 మందికి లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటికే రూ.17,700 కోట్లను బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు ప్రభుత్వం ఈ పథక ప్రయోజనాలు అందించనున్నది.

కేవలం దళిత బంధు పథకమే కాకుండా ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా దళిత సామాజిక వర్గ సంక్షేమం కోసం గత ఏడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,13,192 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ప్రజల జనాభా దామాషాకు అనుగుణంగా నిధులు కేటాయిస్తోంది. ఇందుకోసం ఎస్సీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని రూపొందించింది. 2004 నుంచి 2014 వరకు అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎస్సీ సామాజిక వర్గ ప్రజల సంక్షేమానికి రూ.16,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి చేసిన ఖర్చు రూ.1,13,192 కోట్లు. ఈ ఒక్క ఉదాహరణే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం పట్ల ఉన్న చిత్త శుద్ధిని తెలియజేస్తోంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా లాభసాటి వ్యాపారాలైన ఫెర్టిలైజర్ షాపులు, మెడికల్ షాపులు, మద్యం షాపుల లైసెన్సుల కేటాయింపులో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోంది. విదేశాలలో విద్యను అభ్యసించే షెడ్యూల్ కులాల విద్యార్థులకు రూ.20 లక్షలను అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది.

బలహీన వర్గాల విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించాలనే లక్ష్యంతో 1001 గురుకుల విద్యాలయాలను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మేలైన వసతులతో పాటు ఇంగ్లీష్ మీడియంలో ప్రామాణిక విద్యను ప్రభుత్వం అందిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. గురుకుల విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థినీ, విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ప్రవేశాలను సాధించడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం.

First Published:  14 April 2023 4:50 AM GMT
Next Story