Telugu Global
Telangana

పోడు పట్టాల పంపిణీకి డెడ్ లైన్

పోడు పట్టాల పంపిణీతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష చేపట్టారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా 3 వేల ఇళ్ల పంపిణీ కోసం లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.

పోడు పట్టాల పంపిణీకి డెడ్ లైన్
X

తెలంగాణలో ఇటీవల సీఎం కేసీఆర్, పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంబించారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పోడు పట్టాలు రైతులకు అందజేస్తున్నారు. అయితే వీలైనంత త్వరగా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. 4రోజుల్లోగా పోడు పట్టాల పంపిణీ పూర్తి చేయాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ఎక్కడా ఎవరూ నష్టపోకుండా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలన్నారు.

పోడు పట్టాల పంపిణీతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష చేపట్టారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా 3 వేల ఇళ్ల పంపిణీ కోసం లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. 3 విడతల్లో 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం లబ్ధిదారులకు అందుతుందని చెప్పారు. జిల్లాల్లో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని చెప్పారు. ధరణి పోర్టల్ లో నూతన పట్టాదారుల బ్యాంకు వివరాలు సేకరించి అప్ డేట్ చేయాలని సూచించారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా గ్రామాల వారిగా మొక్కలు నాటేందుకు అవసరమైన మేర ఉపాధి హామీ పథకం క్రింద భూమిని సన్నద్ధం చేయించాలని చెప్పారు.

బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు సీఎస్. రెండో దశ గొర్రెల పంపిణీ యూనిట్లపై లక్ష్యాలు నిర్దేశించామని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన బృందం ఆధ్వర్యంలో గొర్రెలు కొనుగొలు చేయాలని చెప్పారు. జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన గ్రామ పంచాయతీ భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

First Published:  4 July 2023 6:17 AM IST
Next Story