Telugu Global
Telangana

రుణమాఫీపై కొర్రీలు.. చంద్రబాబే ఆదర్శమా..?

ప్రస్తుతం తెలంగాణలో 66 లక్షలమందికి రైతుబంధు అందుతోంది. వాస్తవానికి వారంతా రుణమాఫీకి కూడా అర్హులు కావాల్సి ఉంది.

రుణమాఫీపై కొర్రీలు.. చంద్రబాబే ఆదర్శమా..?
X

తెలంగాణలో రైతు రుణమాఫీ పెద్ద ప్రహసనంలా మారింది. అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు, ఆ తర్వాత డెడ్ లైన్లు మార్చుకుంటూ వెళ్లారు. చివరకు ఆగస్ట్ 15 డెడ్ లైన్ గా పెట్టారు. ఇప్పుడు మినహాయింపులంటూ కొర్రీలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే 2014లో ఏపీలో చంద్రబాబు చేసిన జిమ్మిక్కులు గుర్తొస్తాయి. అప్పట్లో రుణమాఫీ పేరుతో రైతుల్ని దారుణంగా మోసం చేశారు చంద్రబాబు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన ఆదర్శంతో రుణమాఫీ విషయంలో కండిషన్లు పెడుతోందనే ప్రచారం జరుగుతోంది.

అధికారుల ప్రతిపాదనలు..

- పాస్‌బుక్‌లు, రేషన్‌ కార్డులు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ

- ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఆదాయ పన్ను చెల్లించేవారికి రుణమాఫీ లేదు

- ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ లేదు

ఈమేరకు మంత్రిమండలి సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి విధి విధానాలను అధికారికంగా ఖరారు చేస్తారు. రూ.2లక్షల మేరకు పరిమితి విధించి జాబితా తయారు చేయాలని బ్యాంకర్లకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.

లబ్ధిదారులు ఇలా తగ్గిపోతారు..

ప్రస్తుతం తెలంగాణలో 66 లక్షలమందికి రైతుబంధు అందుతోంది. వాస్తవానికి వారంతా రుణమాఫీకి కూడా అర్హులు కావాల్సి ఉంది. వీరిలో 6 లక్షలమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు, అంటే వారికి రుణమాఫీ లేదు. రేషన్ కార్డ్ ప్రాతిపదికగా తీసుకుంటే మరో 18 లక్షలమందికి రుణమాఫీ వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లించేవారిని కూడా పరిగణలోకి తీసుకుంటే మరో 2 లక్షల మందిని తీసేసినట్టే. చివరిగా 40లక్షలమందికే రుణమాఫీ వర్తిస్తుంది. వీరికి కూడా విడతల వారీగా మాఫీచేస్తారా, రూ.2లక్షలు ఒకేసారి మాఫీ చేస్తారా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రైతులు మాత్రం ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇదివరకే ప్రస్తావించారు. అందుకే రుణమాఫీ నిర్ణయం ఆలస్యమైందని కూడా అన్నారు. చివరిగా ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేస్తుంది, ఎంతమందికి అవకాశం ఇస్తుందనేది వేచి చూడాలి.

First Published:  17 Jun 2024 8:37 AM IST
Next Story