Telugu Global
Telangana

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ పోటీచేస్తుందట

తమ్మినేని కన్నా మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పోటీచేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు 5 వేల చిల్లర. తమ్మినేని రాజకీయ అనుభవంతో పోల్చితే బర్రెలక్క అనుభవం ఎందుకు పనికిరాదు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ పోటీచేస్తుందట
X

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అయిపోయింది, ఇక పార్లమెంటు ఎన్నికలకు రెడీ అవుతోంది సీపీఎం. తన బలాన్ని తాను చాలా ఎక్కువగా ఊహించుకుని ఇంకా గట్టిగా చెప్పాలంటే అతిగా ఊహించుకుని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లాపడింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొనుంటే కనీసం ఒక్క అసెంబ్లీలో అయినా ఎక్కడో ఒక నియోజకవర్గంలో గెలిచుండేదేమో. అనవసరంగా అతికి పోయి ఒంటరిగా పోటీచేసింది. కాంగ్రెస్ తో పొత్తులో ఒక్క సీటు తీసుకుని కొత్తగూడెంలో పోటీచేసిన సీపీఐ గెలిచింది.

అదే సీపీఎం మాత్రం బాగా బెట్టుచేసి సీట్ల సర్దుబాటును చెడగొట్టుకున్నది. చివరకు పొత్తులో నుండి బయటకు వచ్చేసి ఒంటరిగానే 17 సీట్లలో పోటీచేసింది. చివరకు ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా కనీసం డిపాజిట్ తెచ్చుకోలేకపోయింది. తనను తాను చాలా గొప్పనేతగా చిత్రీకరించుకునే రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం కూడా బోర్లాపడ్డారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో తమ్మినేనంతటి గొప్పనేత పోటీచేస్తే వచ్చిన ఓట్లు సుమారు 4 వేలు. ఇంతకన్నా అవమానం ఇంకోటుండదేమో.

తమ్మినేని కన్నా మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పోటీచేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు 5 వేల చిల్లర. తమ్మినేని రాజకీయ అనుభవంతో పోల్చితే బర్రెలక్క అనుభవం ఎందుకు పనికిరాదు. అలాంటిది తమ్మినేని కన్నా బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు వచ్చాయంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థ‌మవుతోంది. వచ్చిన ఓట్లతో తమ్మినేని ప‌రువంతా పోయింది. ఒక్కప్పుడు ఖమ్మం ఎమ్మెల్యేగా అంతకుముందు ఖమ్మం ఎంపీగా తమ్మినేని గెలిచిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా పొత్తులోనే పోటీచేసి తమ్మినేని గెలిచారు. ఒంటరిగా పోటీచేస్తే వచ్చిన ఫలితం ఇది.

ఒంటరిగా పోటీచేస్తే సీపీఎం కెపాసిటి ఏమటో అందరికీ అర్థ‌మైపోయింది. ఇలాంటి సమయంలో రాబోయే లోక్‌స‌భ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేయాలని పార్టీ డిసైడ్ అయ్యింది. నియోజకవర్గాలను ప్రకటించలేదు కానీ, బహుశా ఖమ్మం, నల్గొండ లేదా భువనగిరిలో సీపీఎం పోటీచేయొచ్చని పార్టీవర్గాలు చెప్పాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనుభవంతో పొత్తులో పోటీచేయటానికి రెడీ అవుతుందా..? లేకపోతే మళ్ళీ ఒంటెత్తుపోకడలకు పోయి ఒంటరిగానే పోటీచేసి పరువు పోగొట్టుకుంటుందా..? అన్నది చూడాలి.

First Published:  12 Feb 2024 5:28 AM GMT
Next Story