Telugu Global
Telangana

టీ-కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి.. మహిళా విభాగం వార్నింగ్!

తమకు 20 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ మహిళా విభాగం డిమాండ్ చేస్తోంది. లేకపోతే ప్రచారంలో పాల్గొనేది లేదని వార్నింగ్ ఇచ్చారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు.

టీ-కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి.. మహిళా విభాగం వార్నింగ్!
X

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మరింత ఆలస్యమవుతోంది. విడతల వారీగా రివ్యూలు చేస్తున్నప్పటికీ.. సీట్ల పంపిణీ కొలిక్కి రావడంలేదు. మరోవైపు కాంగ్రెస్ మీద‌కు రోజుకో కొత్త పంచాయితీ వచ్చి పడుతోంది. ఇప్పటికే ఓవైపు బీసీలు, కమ్మలు తమకు పెద్ద సంఖ్యలో టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. తాజాగా మహిళలు సైతం టికెట్ల కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో ఈ సమస్యలను పరిష్కరించలేక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

తమకు 20 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ మహిళా విభాగం డిమాండ్ చేస్తోంది. లేకపోతే ప్రచారంలో పాల్గొనేది లేదని వార్నింగ్ ఇచ్చారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు. మహిళల ఓట్లు కావాలి కానీ.. మహిళలకు టికెట్లు ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పథకాలన్ని మహిళలను ఆకర్షించేవేనని.. అందుకోసం మహిళలకు పెద్దపీట వేయాలని కోరుతున్నారు. గెలిచే సీట్లనే మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే బీసీలు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారు. హామీ ఇచ్చిన మేరకు 34 అంతకంటే ఎక్కువ సీట్లే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్‌ కంటే ఎక్కువ ఇస్తామంటున్నారు కానీ.. ఎన్ని సీట్లు ఇస్తారనేది తేలడం లేదు. ఇక రెండు రోజుల క్రితం కమ్మ నేతలు సైతం ఢిల్లీ వెళ్లి అధిష్టానం వ‌ద్ద తమ డిమాండ్ల పెట్టారు. 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్‌సభ స్థానాలు కేటాయించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ల పంచాయితీ పరిష్కరించలేక.. కాంగ్రెస్ అధిష్టానం త‌ల‌ప‌ట్టుకుంటోంది.

First Published:  8 Oct 2023 9:12 AM IST
Next Story