కల్యాణలక్ష్మీ స్థానంలో పసుపు-కుంకుమ.. కాంగ్రెస్ భారీ స్కెచ్!
పేదింటి ఆడబిడ్డ కుటుంబానికి ఆసరాగా ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కార్ కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని తీసుకువచ్చింది.
ప్రస్తుతం ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్.. మరో సంచలన హామీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు స్కీం కింద రైతులకు ఎకరాకు ఏటా పదివేలు అందిస్తుండగా.. తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కౌలు రైతులకు సైతం రైతు బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
తాజాగా బీఆర్ఎస్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకానికి మరో పేరు పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మీ స్థానంలో పసుపు - కుంకుమ అనే పథకం తీసుకురావాలని మేనిఫెస్టో కమిటీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద పెళ్లి కూతురుకు రూ. లక్ష నగదుతో పాటు తులం బంగారం అందించాలని జీవన్ రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం.
పేదింటి ఆడబిడ్డ కుటుంబానికి ఆసరాగా ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కార్ కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని తీసుకువచ్చింది. 2014 అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదట్లో ఈ ఆర్థిక సాయం రూ. 51 వేలుగా ఉండగా.. 2017 మార్చి 13న రూ.75,116లకు పెంచారు. 2018 మార్చి 19న రూ.1,00,116 కు పెంచారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఆడబిడ్డకు పెళ్లి చేసిన తల్లికి రూ. 1,00,116 చొప్పున అందిస్తున్నారు.
ఈ సారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న హస్తం పార్టీ.. అన్ని వర్గాలను ఆకర్షించేలా మేనిఫెస్టో రూపొందించాలని ప్లాన్ చేసింది. మహిళలు, రైతులు, విద్యార్థులు, పేదలు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే హామీలపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విద్యార్థులకు ఉచిత మెట్రో ప్రయాణం, ఫ్రీ వైఫై లాంటి పథకాలపైనా ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్‌తో పాటు ఆరు గ్యారెంటీలను తుక్కుగూడ సభలో ప్రకటించింది కాంగ్రెస్.