Telugu Global
Telangana

మల్లిఖార్జున్ ఖర్గేకే తెలంగాణ కాంగ్రెస్ మద్దతు

సీఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నాయకుడు హనుమంతరావు బహిరంగంగానే ఖర్గేకు మద్దతు పలికారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆయనకే సపోర్ట్‌గా నిలిచారు.

మల్లిఖార్జున్ ఖర్గేకే తెలంగాణ కాంగ్రెస్ మద్దతు
X

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 20 ఏళ్ల తర్వాత తొలి సారి నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ ఎన్నికల బరిలో లేకపోవడం ఒక కారణం అయితే.. మొదటి నుంచి పోటీలో ఉంటారని భావించిన అశోక్ గెహ్లాట్ బదులు మల్లిఖార్జున్ ఖర్గే బరిలో నిలవడం మరో కారణం. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ప్రస్తుతానికి మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్ బరిలో ఉన్నారు. కేఎన్ త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురవడంతో ప్రస్తుతానికి ఇద్దరు మాత్రమే పోటీలో నిలిచారు. కాగా, చాలా మంది శశిథరూర్‌కు బరిలో నుంచి తప్పుకోవాలని సలహా ఇస్తున్నా.. ఆయన మాత్రం పోటీలో నిలవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున్ ఖర్గేకు పలు రాష్ట్రాల పీసీసీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌తో పాటు అక్కడి పీసీసీ కూడా ఖర్గేకు అండగా నిలిచింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కూడా ఖర్గే వెనుక నిలబడాలని నిర్ణయించింది. గతంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలని టీపీసీసీ తీర్మానం చేసింది. అయితే రాహుల్ అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపించలేదు. తెలంగాణ పీసీసీ అధికారికంగా ఖర్గే విషయంలో తీర్మానం చేయకపోయినా.. మెజార్టీ సభ్యులు ఆయన అభ్యర్థిత్వానికే మొగ్గు చూపుతున్నారు.సీఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నాయకుడు హనుమంతరావు బహిరంగంగానే ఖర్గేకు మద్దతు పలికారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆయనకే సపోర్ట్‌గా నిలిచారు.

మల్లిఖార్జున్ ఖర్గేను రేవంత్ 'తెలంగాణ బిడ్డ'గా అభివర్ణించారు. హైదరాబాద్ స్టేట్‌లో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఖర్గే కుటుంబం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఖర్గే పుట్టిన ఊరు ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నా.. గతంలో అది హైదరాబాద్ స్టేట్ పరిధిలో ఉంది.. అందుకే ఖర్గేను తెలంగాణ బిడ్డగా పేర్కొన్నారు. పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవంతో పాటు.. సౌమ్యుడిగా పేరున్న ఖర్గేను తప్పకుండా గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. పీవీ నర్సింహారావు నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు అప్పటి ప్రధాని ఎన్టీఆర్ అక్కడ నుంచి టీడీపీని పోటీలో నిలబెట్టలేదని.. ఒక తెలుగు వాడు ప్రధాని అవుతాడనే ఉద్దేశంతో అలా చేశారని హనుమంతరావు గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు ఓ దళితుడు, హైదరాబాద్‌తో సంబంధం ఉన్న వ్యక్తి జాతీయ పార్టీకి అధ్యక్షుడు అయ్యే అవకాశం వచ్చింది. అందుకే మిగతా వాళ్లు తప్పుకోవడం మంచిదని పరోక్షంగా శశిథరూర్‌కు సూచించారు.

మల్లిఖార్జున్ ఖర్గే కనుక కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే అదొక రికార్డు అవుతుంది. బాబూ జగ్జీవన్ రామ్ తర్వాత ఆ పార్టీకి అధ్యక్షుడు అయిన దళితుడిగా రికార్డు సృష్టిస్తారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి దళితుడు అధ్యక్షుడు కాలేదు. భట్టి విక్రమార్క మాత్రం ఆయన దళితుడు అనే విషయాన్ని కావాలనే బీజేపీ హైలైట్ చేస్తోందని, ఒక వర్గం ప్రజలకే ఆయన ప్రతినిధి అనే మాటలు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలపై బీజేపీ వ్యాఖ్యానించడం సిగ్గు చేటని అన్నారు. పార్టీ భవిష్యత్ కోసం ఖర్గేను గెలిపించుకోవడం అవసరమని, శశిథరూర్ ఈ విషయంలో మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు.

First Published:  4 Oct 2022 4:50 PM IST
Next Story