Telugu Global
Telangana

వైఎస్ షర్మిల విషయంలో రెండుగా విడిపోయిన తెలంగాణ కాంగ్రెస్!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అతని వర్గం మాత్రం వైఎస్ఆర్టీపీ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

వైఎస్ షర్మిల విషయంలో రెండుగా విడిపోయిన తెలంగాణ కాంగ్రెస్!
X

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెబుతుంటారు. ఎవరికి వారే గ్రూపులు కట్టి.. కొన్ని విషయాల్లో రచ్చకెక్కుతుంటారు. ఇప్పుడు వైఎస్ షర్మిల విషయంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయినట్లు తెలుస్తున్నది. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌లోని సీనియర్లు సానునకూలంగా ఉన్నారు. వైఎస్ షర్మిల కనుక తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే.. తెలంగాణ ప్రాంతంలో బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఇది తప్పకుండా కలిసి వస్తుందని సీనియర్లు అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అతని వర్గం మాత్రం వైఎస్ఆర్టీపీ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వల్ల తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వస్తుందని నివేదిక పంపించారు. షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రజలు ఇంకా మరిచిపోలేదని.. బీఆర్ఎస్ కూడా ఇదే విషయాన్ని లేవనెత్తి.. కాంగ్రెస్‌పై వ్యతిరేక ప్రచారం చేసే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి వర్గం ఆందోళన చెందుతున్నది.

ఇటీవల ఏఐసీసీ ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే కూడా షర్మిల పార్టీ విలీనంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల ఇమేజ్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది. అయితే కేవలం ఏపీలో మాత్రమే అది సానుకూలంగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో వ్యతిరేకత చూపే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూడా వైఎస్ షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకొని రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీపై నెగెటివ్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా చెప్పినట్లు తెలుస్తున్నది.

సీనియర్ కాంగ్రెస్ లీడర్ వీ హనుమంతరావు కూడా షర్మిల పార్టీ విలీనం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీస్తుందని వ్యాఖ్యానించారు. ఒక వేళ పార్టీని విలీనం చేసే.. ఆమెను ఏపీ రాజకీయాల కోసం వాడుకోవాలని సూచించారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు మాత్రం షర్మిల పార్టీ విలీనం వల్ల తెలంగాణలో ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నారు. ఇక్కడ ఆమె కొన్ని సెగ్మెంట్లలో ప్రభావం చూపిస్తారని అంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై రెండు వర్గాలుగా విడిపోయి నివేదికలు పంపడంతో అధిష్టానం ఆ నిర్ణయంపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం పూర్తిగా ఇతర పార్టీ నాయకులు చేరికల మీదనే దృష్టి పెట్టింది. వైఎస్ షర్మిల పార్టీ విలీనం విషయాన్ని మరి కొన్ని రోజులు పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డే వ్యతిరేకిస్తుండటంతో షర్మిల పార్టీ విలీనంపై ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని సమాచారం.

First Published:  26 Jun 2023 9:48 AM IST
Next Story