Telugu Global
Telangana

తెలంగాణ కాంగ్రెస్ లో చంద్రబాబు కలకలం

బాబు ఆలోచనలు తోడయితే వైరి వర్గాన్ని సమూలంగా నిర్మూలించడానికి రేవంత్ ఏమాత్రం వెనకాడరు. అదే జరిగితే తమ కొంప మునుగుతుందని రేవంత్ వైరి వర్గం భయపడుతోంది. కాంగ్రెస్ పటిష్టతకోసం ఏళ్లతరబడి పనిచేసిన తాము రేపు చంద్రబాబుకి సలాం కొట్టాల్సిన పరిస్థితి వస్తుందేమోననేది కాంగ్రెస్ లోని రెడ్డి సామాజిక వర్గం ఆందోళన.

తెలంగాణ కాంగ్రెస్ లో చంద్రబాబు కలకలం
X

తెలంగాణలో టీడీపీ పోటీనుంచి తప్పుకుంది. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. అయితే దానికి కారణం కాంగ్రెస్ కి పరోక్షంగా లాభం చేకూర్చడమేననేది మాత్రం ఆలోచించాల్సిన విషయం. ఇదేమీ ఊహాగానం కాదు, స్వయానా టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్, తాను పార్టీకి దూరమవుతూ బయటపెట్టిన నిజం. చంద్రబాబుకి రేవంత్ రెడ్డిపై ఉన్న ప్రేమకు నిదర్శనం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. నిజంగానే టీడీపీ ఓట్లతో కాంగ్రెస్ లాభపడితే.. చంద్రబాబు ఊరికే ఉంటారా అనేదే అసలు సమస్య. తన శిష్యుడు రేవంత్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ పై పెత్తనం చలాయించాలని చూస్తారు. తన మనుషుల్ని మెల్లిమెల్లిగా అన్ని చోట్లా విస్తరించేలా చేస్తారు, వారికి పదవులిప్పించుకుంటారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ ని తన గుప్పెట్లో పెట్టుకుంటారు.

తెలంగాణ కాంగ్రెస్ లో రెడ్డి సామాజి వర్గానికి చెందిన నాయకులకు మొదటినుంచీ మంచి పట్టుంది. గతంలో కమ్మ ఆధిపత్యాన్ని తట్టుకోలేక వారంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరై పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ఆ వర్గానిదే హవా. కానీ అది చంద్రబాబుకి వంతపాడే 'రేవంత్' రెడ్డి సామాజిక వర్గం కావడం ఇక్కడ విశేషం. అంటే ఇక్కడ పరోక్షంగా బాబు వర్గం బలపడుతోంది. అది తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న పాతతరం నాయకులకు నచ్చడంలేదు. రెడ్డి సామాజిక వర్గానికి అస్సలు మింగుడు పడటం లేదు. ఎప్పటికైనా చంద్రబాబుతో తమకు ముప్పు తప్పదనేది వారి ఆలోచన.

ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు తెలంగాణలో తన ఉనికి కోల్పోయారు. అయితే ఆ పార్టీకి అక్కడక్కడా కేడర్ మిగిలే ఉంది. నాయకులు కూడా మిగతా పార్టీల్లో షెల్టర్ తీసుకుంటున్నా.. టీడీపీ అనే లింకు వారి మధ్య అలాగే ఉంది. ఇక సెటిలర్లకు కూడా టీడీపీపై అభిమానం అక్కడక్కడా మిగిలి ఉంది. కానీ నేరుగా టీడీపీ తెలంగాణలో పోటీ చేయలేదు, గెలవలేదు. ఆ విషయం హరికృష్ణ కుమార్తె దారుణంగా ఓడిపోయినప్పుడే అందరికీ అర్థమైంది. అందుకే చంద్రబాబు తెలివిగా రేవంత్ రెడ్డితో వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. మెల్లిగా రేవంత్ ని కాంగ్రెస్ కి దగ్గర చేసి ఏకంగా పీసీసీ అధ్యక్షుడిగా చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణ అసెంబ్లీ టికెట్ల కేటాయింపు విషయంలో రేవంత్ రెడ్డి పూర్తిగా తన పట్టు నిరూపించుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ఓ వర్గాన్ని పూర్తిగా దూరం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే రేవంత్ మినహా అధిష్టానం వేరేవారి గురించి ఆలోచించదు. అంటే రేవంత్ సీఎం అయితే, చంద్రబాబు పెత్తనం పార్టీపై మరింత పెరిగినట్టే లెక్క. బాబు ఆలోచనలు తోడయితే వైరి వర్గాన్ని సమూలంగా నిర్మూలించడానికి రేవంత్ ఏమాత్రం వెనకాడరు. అదే జరిగితే తమ కొంప మునుగుతుందని రేవంత్ వైరి వర్గం భయపడుతోంది. కాంగ్రెస్ పటిష్టతకోసం ఏళ్లతరబడి పనిచేసిన తాము రేపు చంద్రబాబుకి సలాం కొట్టాల్సిన పరిస్థితి వస్తుందేమోననేది కాంగ్రెస్ లోని రెడ్డి సామాజిక వర్గం ఆందోళన. అంటే మళ్లీ కమ్మవారి ఆధిపత్యాన్ని కాంగ్రెస్ లోని రెడ్లు ఒప్పుకున్నట్టే లెక్క.

First Published:  31 Oct 2023 12:14 PM IST
Next Story