డీకే శివకుమార్ కోసం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూపు!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత సమస్యలు పరిష్కరించి.. అందరినీ ఒకే తాటిపైకి తేవడానికి ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అంతర్గత సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. సీనియర్ల మధ్య ఉన్న విభేదాల కారణంగా క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఒకవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేనిఫెస్టో విడుదల కాకముందే అనేక హామీలు గుప్పిస్తున్నారు. మరోవైపు సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 1000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసినా మీడియాలో మాత్రం పెద్దగా ప్రచారం దక్కడం లేదు.
భట్టి విక్రమార్క పాదయాత్ర సమయంలో క్షేత్ర స్థాయిలోని నాయకుల మధ్య విభేదాలు కూడా బయటపడుతున్నాయి. ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన పాదయాత్రకు మద్దతుగా తిరగడం లేదనే చర్చ కూడా జరుగుతున్నది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత సమస్యలు పరిష్కరించి.. అందరినీ ఒకే తాటిపైకి తేవడానికి ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు.
కర్ణాటక ఎన్నికలకు ముందు కూడా అక్కడి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి విభేదాలే ఉండేవి. కానీ సీనియర్లు, జూనియర్లను ఏకం చేసి పార్టీకి విజయాన్ని అందించడంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సఫలీకృతం అయ్యారు. గతంలో రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గాల మధ్య విభేదాలు వచ్చినప్పుడు కూడా శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న శివకుమార్ సేవలను తెలంగాణలో వాడుకోవాలని అధిష్టానం నిర్ణయించింది.
డీకే శివకుమార్ త్వరలోనే తెలంగాణ ఇంచార్జిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తున్నది. ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కర్ణాటకలో గవర్నమెంట్ కాస్త కుదురుకున్నాక.. తెలంగాణ బాట పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు కూడా డీకే ఎప్పుడు వస్తారా అని ఆశగా ఎదరు చూస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు మార్లు డీకేని కలిసి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా డీకే శివకుమార్ ఇమేజ్ పెరిగింది. దీంతో ఆయనతో పలు బహిరంగ సభలో నిర్వహించడానికి కూడా టీపీసీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ వంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే డీకే వంటి వ్యూహకర్త సేవలు తప్పకుండా అవసరం అవుతాయని భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా పని చేస్తున్న సునిల్ కనుగోలుకు కూడా డీకే శివకుమార్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా డీకేకు బాధ్యతలు అప్పగించడం పట్ల పెద్ద వ్యతిరేకత చూపించడం లేదు.
డీకే కనుక ఇంచార్జి బాధ్యతలు చేపడితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గాడిన పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అసమ్మతి నేతల వైఖరికి అడ్డుకట్ట పడుతుందని.. ఎన్నికల వ్యూహాలు కూడా సత్ఫలితాలు ఇస్తాయని భావిస్తున్నారు. మరి డీకే ఎప్పుడు తెలంగాణ రాజకీయ బరిలోకి దిగుతారో వేచి చూడాలి.