Telugu Global
Telangana

'సేవ్ కాంగ్రెస్' పేరుతో పార్టీని సీనియర్లు ముంచేయబోతున్నారా? వారి ఆరోపణలు నిజమేనా?

పార్టీ పరిస్థితి రాష్ట్రంలో పూర్తిగా దిగజారి పోయిందని, అధికార బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. తమ పుట్టిని తామే ముంచుకుంటుందని అంటున్నారు.

సేవ్ కాంగ్రెస్ పేరుతో పార్టీని సీనియర్లు ముంచేయబోతున్నారా? వారి ఆరోపణలు నిజమేనా?
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని 'సేవ్ కాంగ్రెస్' పేరుతో రక్షిస్తామని సీనియర్ నేతలు అంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన సీనియర్లు.. సమాంతర పీసీసీ నడిపించేందుకు అంతర్గతంగా తీర్మానించుకున్నట్లు తెలుస్తున్నది. ఇకపై రేవంత్ రెడ్డి పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, తామే సొంతగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే, జరుగుతున్న పరిణామాలు చూస్తున్న కార్యకర్తలు మాత్రం.. ఇది 'సేవ్ కాంగ్రెస్' కాదని.. పార్టీని నాశనం చేయడమే అని అంటున్నారు.

ఇప్పటికే పార్టీ పరిస్థితి రాష్ట్రంలో పూర్తిగా దిగజారి పోయిందని, అధికార బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. తమ పుట్టిని తామే ముంచుకుంటుందని అంటున్నారు. ఇబ్బందుల్లో ఉన్న పార్టీని ఇది పూర్తిగా తొక్కేయమేనని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వైపు అధికారం కోసం ఆరాటపడుతున్న బీజేపీ అన్ని పార్టీల నుంచి వచ్చిన నేతలను కలుపుకొని దూసుకొని పోతుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం వలస నాయకుల పేరుతో పార్టీలో విభేదాలు సృష్టించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సీనియర్లు అతనిపై వ్యతిరేకతతోనే ఉన్నారు. కొంత మంది మొదటి నుంచి రేవంత్‌పై విమర్శలు చేస్తూ, తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కానీ, కొంత మంది సీనియర్లకు రేవంత్‌పై వ్యతిరేకత ఉన్నా.. బయట పడలేదు. సైలెంట్‌గా ఉంటూనే అంతర్గతంగా రేవంత్‌పై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు పంపారు. ముఖ్యంగా మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, మహేశ్వర్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి సీనియర్లు రేవంత్‌కు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో ఉన్న కోపాన్ని.. తాజాగా బయపెట్టుకున్నారు.

తాము ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా తమను పార్టీలో కోవర్టులుగా ముద్ర వేస్తున్నారని మండిపడుతున్నారు. ఇకపై సొంతగా కార్యక్రమాలు నిర్వహించుకుంటామని చెబుతున్నారు. అంటే సమాంతరంగా మరో పీసీసీని నడిపిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వలస నేతలు కాంగ్రెస్ పార్టీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారని, వారే పార్టీని నడిపిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

బీజేపీలో కూడా భారీగా వలసలు ఉన్నాయి.కానీ, ఆ పార్టీలో ఎప్పుడూ వలస నాయకులపై తిరుగుబాటు చేసింది లేదు. పైగా కొన్ని రాష్ట్రాల్లో వలస నాయకులే కీలక పదవుల్లో ఉన్నారు. కొంత మంది ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొత్తగా ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తే వారిని సీనియర్లు దూరం పెడుతున్నారు. పైగా.. కొత్త నాయకులకు సహకరించకుండా కార్యకర్తలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీసీసీకి సంబంధించిన పలు కమిటీలను ప్రకటించింది. ఇందులో సగం మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక్కడ గుర్తు చేసుకోవల్సిన విషయం ఏంటంటే.. ఆయన పరోక్షంగా రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. కానీ అసలు రేవంత్ రెడ్డిని ఢిల్లీ తీసుకెళ్లి పార్టీలో చేర్పించిందే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు అతడి నాయకత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కాగా, పార్టీలో సీనియర్లు ఆరోపిస్తున్నట్లు వలస నేతలకు భారీగా పదవులు దక్కాయా? టీడీపీ నుంచి వచ్చిన వారికే 50 శాతానికి పైగా ప్రాధాన్యత లభించిందా అంటే కాదనే సమాధానం వస్తోంది. పీసీసీ కమిటీల జాబితా చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ సత్య దూరమే అని తేలుతుంది. పీసీసీ కమిటీలపై ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌ను కలుస్తామని సీనియర్లు అంటున్నారు. కమిటీలను పునర్‌ వ్యవస్థీకరించాల్సిందేనని కోరతామని అంటున్నారు. 'సేవ్ కాంగ్రెస్' పేరుతో ఉద్యమం ఆపబోమని అంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ గట్టిగా కష్టపడితే బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాగలదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ పార్టీలోని అంతర్గత కారణాలు కారణంగా.. ఈ సారి డబుల్ డిజిట్ సీట్లైనా గెలుచుకుంటుందనే నమ్మకం లేనట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని కుమ్ములాటలే బీజేపీకి వరంగా మారాయని, క్రమంగా కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని బీజేపీ కొల్లగొడుతోందని అంటున్నారు. రేవంత్ ఉన్నంత వరకు పార్టీ గెలవకపోయినా పర్వాలేదనే ఆలోచనలో సీనియర్లు ఉన్నట్లు తెలుస్తున్నది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఇప్పుడు రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ సీనియర్లలో ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టినా ఇదే పరిస్థితి ఉంటుందని పార్టీలోనే చర్చ జరుగుతున్నది. కేవలం పదవి కోసం కొట్లాడుతారు కానీ.. పార్టీని బాగుచేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టరని కొంత మంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా.. పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచాల్సిన నేతలు.. ఇలా అంతర్గతంగా కుమ్ములాడుపోవడం ఏంటని అంటున్నారు. ఇలాగే ఉంటే.. పార్టీ తెలంగాణ నుంచి పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



First Published:  18 Dec 2022 9:13 AM IST
Next Story