Telugu Global
Telangana

అక్టోబర్‌ 22న కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్.. కామారెడ్డి అభ్యర్థిపై సస్పెన్స్‌.!

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేది ఎవరనేదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. గతంలో ఈ స్థానం నుంచి షబ్బీర్‌ అలీ పోటీ చేశారు. అయితే ఈ సారి పోటీ చేసేందుకు షబ్బీర్‌ అలీ వెనుకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అక్టోబర్‌ 22న కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్.. కామారెడ్డి అభ్యర్థిపై సస్పెన్స్‌.!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ 55 మందితో ఫస్ట్‌ లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ సెకండ్‌ లిస్ట్‌పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సెకండ్‌ లిస్ట్‌లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. మూడో జాబితా కూడా ఉంటుందని తెలుస్తోంది. అక్టోబర్‌ 25 నాటికి మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు సమాచారం.

అక్టోబర్‌ 22న 50 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితా రిలీజ్ చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అక్టోబర్‌ 15న 55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ రిలీజ్ చేసింది హస్తం పార్టీ. మొదటి జాబితాలో మైనంపల్లి హన్మంతరావుతో పాటు మైనంపల్లి రోహిత్‌కు టికెట్ ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఫస్ట్‌ లిస్ట్‌లో టికెట్‌ దక్కని కొందరు అసంతృప్తులు.. ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పారు.

రెండో లిస్ట్‌ను అక్టోబర్ 19నే విడుదల చేయాలని భావించినప్పటికీ.. అసంతృప్తుల నిరసనలకు భయపడి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. రాహుల్ బస్సు యాత్ర నుంచి మీడియా దృష్టిని మళ్లించొద్దనే ప్లాన్‌లో భాగంగానే రెండో లిస్ట్ ప్రకటనను వాయిదా వేశారని సమాచారం.

ఇక కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేది ఎవరనేదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. గతంలో ఈ స్థానం నుంచి షబ్బీర్‌ అలీ పోటీ చేశారు. అయితే ఈ సారి పోటీ చేసేందుకు షబ్బీర్‌ అలీ వెనుకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో 2019లో జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన మదన్‌మోహన్‌ రావును రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం పావులు కదుపుతోందని తెలుస్తోంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తారన్న మరో ప్రచారం కూడా ఉంది.

First Published:  20 Oct 2023 9:57 AM GMT
Next Story