Telugu Global
Telangana

కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్ ఎప్పుడంటే..!

తెలంగాణ జన సమితి సైతం కాంగ్రెస్‌తో పొత్తు కోసం చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్‌కు ఆరు సీట్లు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి.

కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్ ఎప్పుడంటే..!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ అభ్యర్థుల సెకండ్‌ లిస్ట్ కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఈనెల 20 తర్వాతే ఈ లిస్ట్‌ విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 119 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని మొదట నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. కానీ, పెద్దగా వివాదాలు లేని 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ మొదటి లిస్ట్‌ రిలీజ్ చేసింది. మిగిలిన స్థానాలకు ఈనెల 18లోపు అభ్యర్థులను ఖరారు చేయాలని భావించింది.

రాష్ట్రంలో రాహుల్‌గాంధీ, ప్రియాంక టూర్ కారణంగా సెకండ్‌ లిస్ట్ రిలీజ్‌ ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఇక లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశంపైనా చర్చలు జరుగుతున్నాయి. సీపీఎం, సీపీఐకి చెరో రెండు సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్‌ ఒకే చెప్పింది. కానీ, ఏ సీట్లు ఇవ్వాలన్న దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. సీపీఎం పాలేరు, మిర్యాలగూడ, భద్రాచలం ఇవ్వాలని అడగ్గా.. భద్రాచలం స్థానానికి ఇప్పటికే పొదెం వీరయ్యను అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్‌. ఇక పాలేరు స్థానం పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి ఇస్తారని తెలుస్తోంది.

తెలంగాణ జన సమితి సైతం కాంగ్రెస్‌తో పొత్తు కోసం చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్‌కు ఆరు సీట్లు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపైనా కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారని సమాచారం.

మరోవైపు మొదటి లిస్ట్‌ ప్రకటించిన తర్వాత పలు స్థానాల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు రోడ్డెక్కారు. గాంధీభవన్ ఎదుట ఆందోళనలు, నిరసనలు చేశారు. అయితే పెండింగ్‌లో ఉన్న మిగిలిన స్థానాల్లో ఒక్కో స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. ఒక్కో చోట కాంగ్రెస్‌ టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు నేతలు సైతం పోటీ పడుతున్నారు. దీంతో సెకండ్‌ లిస్ట్ ప్రకటిస్తే.. అసమ్మతి సెగ మరింత పెరిగే ఛాన్స్‌ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

First Published:  18 Oct 2023 11:22 AM IST
Next Story