Telugu Global
Telangana

తెలంగాణ నుంచి లోక్ సభకు సోనియా పోటీ..! నియోజకవర్గం ఏదంటే..?

గ‌తంలో ఇందిరా గాంధీ మెద‌క్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నాయకులు మరింత ఉత్సాహంతో సోనియా గాంధీ పేరు ప్రతిపాదించారు. సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించాల‌ని పీఏసీ సమావేశంలో తీర్మానం చేశారు.

తెలంగాణ నుంచి లోక్ సభకు సోనియా పోటీ..! నియోజకవర్గం ఏదంటే..?
X

అధికారంలోకి వచ్చాక తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరింత ఉత్సాహంగా కనపడుతున్నారు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్‌ స‌భ‌కు పోటీ చేయించాల‌ని కాంగ్రెస్ పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ తీర్మానం చేసింది. గాంధీ భ‌వ‌న్‌ లో పీఏసీ చైర్మ‌న్ మాణిక్ రావు థాక్రే అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు త‌దిత‌రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇన్ చార్జ్‌ లకు కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెపుతూ తీర్మానం చేశారు.

గతంలో ఇందిర, ఇప్పుడు సోనియా..

గ‌తంలో ఇందిరా గాంధీ మెద‌క్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నాయకులు మరింత ఉత్సాహంతో సోనియా గాంధీ పేరు ప్రతిపాదించారు. సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించాల‌ని పీఏసీ సమావేశంలో తీర్మానం చేశారు. సోనియా ఇక్కడినుంచి పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ మరిన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోనియాకోసం ఏదైనా నియోజకవర్గాన్ని ఎంపిక చేశారా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది.

ఈనెల 28నుంచి దరఖాస్తులు..

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జరిగిన తొలి పీఏసీ స‌మావేశం ఇది. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు, నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ, ఆరు గ్యారెంటీల అమ‌లుపై చ‌ర్చించారు. స‌మావేశం వివరాలను ష‌బ్బీర్ అలీ మీడియాకు తెలియజేశారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్ప‌టికే రెండు గ్యారెంటీలు అమ‌లు చేశామ‌ని తెలిపారాయన. మిగ‌తా గ్యారెంటీల అమ‌లుపై అసెంబ్లీలో చ‌ర్చిస్తామ‌న్నారు. గ్రామ స‌భ‌లు నిర్వ‌హించి అర్హులైన వారికి రేష‌న్ కార్డులు అంద‌జేస్తామన్నారు. మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ. 2500 భృతిపై ఈ నెల 28న చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామన్నారు. రూ.4 వేల పెన్ష‌న్ పెంపు విధివిధానాల‌పై చ‌ర్చిస్తున్నామని తెలిపారు. ఈ నెల 28 నుంచి కొన్ని ప‌థ‌కాల‌కు ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమ‌లు చేసి చూపిస్తాం అన్నారు షబ్బీర్ అలీ.

*

First Published:  18 Dec 2023 11:03 AM GMT
Next Story