Telugu Global
Telangana

రాహుల్‌కు మ‌ద్ద‌తుగా టీ-కాంగ్రెస్ నేత‌ల రాజీనామా యోచ‌న‌

మ‌రోప‌క్క రాహుల్‌పై చ‌ర్య‌లపై భ‌గ్గుమంటున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రాహుల్‌కు మ‌ద్ద‌తుగా తాము కూడా రాజీనామా చేయాల‌ని భావిస్తున్నారు.

రాహుల్‌కు మ‌ద్ద‌తుగా టీ-కాంగ్రెస్ నేత‌ల రాజీనామా యోచ‌న‌
X

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. పరువు న‌ష్టం కేసులో సూర‌త్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో లోక్‌సభ స‌చివాల‌యం ప్ర‌జాప్ర‌తినిధ్య చ‌ట్టం కింద‌.. ఆయ‌న లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం నోటిఫికేష‌న్ ఇచ్చింది.

దీనిపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ బీజేపీ తీరును ఖండించాయి. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీ తదిత‌రులు బీజేపీ తీరుపై మండిప‌డిన విష‌యం తెలిసిందే.

మ‌రోప‌క్క రాహుల్‌పై చ‌ర్య‌లపై భ‌గ్గుమంటున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రాహుల్‌కు మ‌ద్ద‌తుగా తాము కూడా రాజీనామా చేయాల‌ని భావిస్తున్నారు. ఇదే విష‌య‌మై పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ ఠాక్రేతో రేవంత్‌రెడ్డి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి చ‌ర్చిస్తున్నారు. బీజేపీ క‌క్ష‌పూరితంగా వేధింపుల‌కు గురిచేస్తోంద‌ని మండిప‌డుతున్న కాంగ్రెస్ నేత‌లు హైద‌ర్‌గూడ‌లోని ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లో పార్టీ ఇన్‌చార్జి ఠాక్రేతో ఈ అంశంపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీనియ‌ర్ నేత ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి చ‌ర్చిస్తున్నారు.

త‌మ రాజీనామాల ద్వారా దేశవ్యాప్తంగా ఈ అంశం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతుంద‌ని, అది త‌మ‌కు సానుకూలంగా మారే అవ‌కాశ‌ముంటుంద‌ని వారు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో త‌మ నిర్ణ‌యంపై శ‌నివారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు జ‌రిగే టీపీసీసీ ముఖ్య నేత‌ల భేటీలో ఒక నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది.

First Published:  25 March 2023 2:12 PM IST
Next Story