కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ప్రభుత్వ స్పందన
దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నిటికీ ఈ బడ్జెట్ లో అన్యాయం జరిగిందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణను పూర్తిగా విస్మరించారని చెప్పారు.
కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు జీరో అని బడ్జెట్ విడుదల కాక ముందే తేల్చి చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు అదే నిజమైంది. తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూసింది. పొరుగున ఉన్న ఏపీపై 15వేల కోట్ల రూపాయల ప్రేమ చూపించిన కేంద్రం తెలంగాణకు మాత్రం కేటాయింపుల్లో అన్యాయం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా బడ్జెట్ పై పెదవి విరిచింది. అధికార కాంగ్రెస్ నేతలు ఈ బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నిటికీ ఈ బడ్జెట్ లో అన్యాయం జరిగిందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణను పూర్తిగా విస్మరించారని చెప్పారు. విభజన చట్టం హామీలను తప్పనిసరిగా అమలు చేయాల్సిన సందర్భంలో తెలంగాణను పట్టించుకోలేదని విమర్శించారాయన. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని అన్నారాయన. కేవలం జేడీయూ, టీడీపీని ప్రసన్నం చేసేందుకే ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారన్నారు మంత్రి ఉత్తమ్. బీహార్, ఏపీకి ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్రం.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.
లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా కేంద్ర బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది కుర్చీ బచావో బడ్జెట్ అని, కేవలం మిత్ర పక్షాలను బుజ్జగించేందుకు ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కనబెట్టారని అన్నారు. కేవలం వారికి మాత్రమే వరాలు ఇచ్చారని, సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపశమనం కల్పించకుండా.. పెట్టుబడిదారులకు మాత్రమే హామీలు ఇచ్చారన్నారు రాహుల్ గాంధీ.