Telugu Global
Telangana

కోమటిరెడ్డిని ఇంకెంత కాలం భరించాలి.. తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ముసలం!

కోమటిరెడ్డిపై గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు మల్లు రవి అన్నారు.

కోమటిరెడ్డిని ఇంకెంత కాలం భరించాలి.. తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ముసలం!
X

కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తేవాలని సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సుదీర్ఘంగా 'భారత్ జోడో యాత్ర' పేరుతో దేశమంతా నడిచారు. ఆయన వెంట పార్టీ నాయకులే కాకుండా సామాన్యులు, కార్మికులు, ఉద్యోగులు ,మేధావులు, నటులు, క్రీడాకారులు ఎందరో సంఘీభావంగా తోడు వచ్చారు. ఇప్పుడు ఆ యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 'యాత్ర' పేరుతో నడుస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొని రావడమే తన లక్ష్యం అంటూ మేడారం నుంచి నడక ప్రారంభించి ఇప్పుడు భద్రాచలం చేరుకున్నారు.

రేవంత్ యాత్ర ప్రారంభించి వారం రోజులైనా ఇంకా అందరూ మౌనంగా ఉన్నారేమిటనే సందేహం వచ్చేలోపే.. నేనున్నాను అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చేశారు. ఒకవైపు అధికారం కోసం రాష్ట్ర చీఫ్ నడుస్తుంటే.. కోమటిరెడ్డి మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవదని.. ఓడిపోతుందని జోస్యం చెప్పేశారు. ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌తో కలవాల్సిందేనని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో దుమారం రేపాయి. పార్టీలో లుకలుకలు తగ్గాయనుకున్న ప్రతీ సారి ఎవరో ఒక సీనియర్ నాయకుడు చేసే వ్యాఖ్యలు కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.

కోమటిరెడ్డిపై గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు మల్లు రవి అన్నారు. ఆయన పార్టీ లైన్ దాటి మాట్లాడారని.. చాలా కాలంగా ఆయన బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని, ఇంకెంత కాలం ఆయనను భరించాలని అన్నారు. తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు ఉండవని ఇప్పటికే రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. వరంగల్ సభలోనే రాహుల్ గాంధీ స్పష్టంగా ఈ విషయం చెప్పారని మల్లు రవి అన్నారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కూడా స్పందించారు. కాంగ్రెస్‌ను బలహీనపర్చేదుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తే మంచిదని దయాకర్ సూచించారు. వెంకట్ రెడ్డి వ్యవహార శైలి చాలా అభ్యంతరకరంగా ఉందని.. కాంగ్రెస్ క్యాడర్‌లో జోడో యాత్ర ద్వారా వచ్చిన మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంటక్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ రానున్న మాణిక్ రావ్ ఠాక్రే..

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఆరా తీశారు. రాష్ట్ర సీనియర్ నేతలతో కూడా ఆయన వ్యవహార శైలిపై ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ వస్తానని ఆయన చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సరి కాదని అన్నారు. ప్రతీ ఒక్కరు పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నించాలని వీహెచ్ సలహా ఇచ్చారు. కింది స్థాయి కార్యకర్తలు కొట్లాడుతుంటే.. ఇక్కడ కూర్చొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అని అన్నారు.

First Published:  14 Feb 2023 12:25 PM GMT
Next Story