Telugu Global
Telangana

కాంగ్రెస్ లో బీసీ లొల్లి.. నేతల చలో ఢిల్లీ

రాష్ట్రంలోని ప్రతి లోక్‌ సభ స్థానంలో రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున మొత్తం 34 సీట్లను బీసీలకు కేటాయించాలనేది ఆ వర్గం నేతల డిమాండ్. అయితే దానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు లేవు. బీసీ టికెట్ల విషయంలో అధిష్టానం మొండిచేయి చూపుతుందనే అనుమానం వారిలో ఉంది.

కాంగ్రెస్ లో బీసీ లొల్లి.. నేతల చలో ఢిల్లీ
X

తెలంగాణలో కాంగ్రెస్ ఆశావహుల దరఖాస్తులు పూర్తయ్యాయి, స్క్రూటినీ అయిపోయింది, వివిధ దశల వడపోత పూర్తయింది, అయినా కూడా లిస్ట్ ఇంకా బయటకు రాలేదు. అభ్యర్థుల జాబితా విషయంలో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ దశలో మినిమమ్ టికెట్స్ అంటూ బీసీ నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు మరోసారి ఢిల్లీకి బయలుదేరారు.

మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఓబీసీ జాతీయ సమన్వయకర్త కత్తి వెంకటస్వామి మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్‌ కుమార్‌ యాదవ్ తదితరులు ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈరోజు లేదా రేపు వీరు మల్లికార్జున్ ఖర్గేని కలవాలనుకుంటున్నారు. మరోసారి బీసీ సీట్ల విషయంలో పంచాయితీ పెట్టాలని డిసైడ్ అయ్యారు.

బీసీ నేతల్లో భయం..

రాష్ట్రంలోని ప్రతి లోక్‌ సభ స్థానంలో రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున మొత్తం 34 సీట్లను బీసీలకు కేటాయించాలనేది ఆ వర్గం నేతల డిమాండ్. అయితే దానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు లేవు. బీసీ టికెట్ల విషయంలో అధిష్టానం మొండిచేయి చూపుతుందనే అనుమానం వారిలో ఉంది. అందుకే అందరూ గుంపుగా మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు.

మాట నిలబెట్టుకోవాలి..

బీసీలకు కనీస సీట్లు ఇస్తామని అధిష్టానం మాటిచ్చిందని, ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీలో కూడా ఈమేరకు హామీ ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు ఆశించిన సీట్లు ఇస్తే కచ్చితంగా గెలిచి చూపిస్తామంటున్నారు నేతలు. సీట్లు పెంచితే, తెలంగాణలో బీసీ ఓటర్లు కాంగ్రెస్ కి మరింత దగ్గరవుతారని అంటున్నారు. మరి వీరి ఆశలు నెరవేరతాయో లేవో చూడాలి.


First Published:  27 Sept 2023 5:53 AM IST
Next Story