Telugu Global
Telangana

అభ్యర్థుల ప్రకటనపై తలో మాట.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆందోళన!

నామినేషన్ల చివరి రోజు కూడా బీ-ఫామ్‌లు ఇచ్చిన చరిత్ర ఉన్న కాంగ్రెస్.. ఈ సారైనా త్వరగా టికెట్లు ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.

అభ్యర్థుల ప్రకటనపై తలో మాట.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆందోళన!
X

తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను కాంగ్రెస్ ఎప్పుడు ప్రకటిస్తుందో ఆ పార్టీ నాయకులకే క్లారిటీ లేకుండా పోయింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా టికెట్ల విషయం ఇంకా కొలిక్కి రాకపోవడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక వైపు అధికార బీఆర్ఎస్ చానాళ్ల క్రితమే అభ్యర్థులను ప్రకటించి.. అసంతృప్తులను బుజ్జిగించేసింది. ఈ నెల 15న బీ-ఫామ్స్ కూడా ఇచ్చేందుకు మూహూర్తం ఖరారు చేసింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. కానీ, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని.. తప్పకుండా అధికారంలోకి వస్తామని భీకర ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల జాబితాపై ఎటూ తేల్చుకోలేకపోతోంది.

నామినేషన్ల చివరి రోజు కూడా బీ-ఫామ్‌లు ఇచ్చిన చరిత్ర ఉన్న కాంగ్రెస్.. ఈ సారైనా త్వరగా టికెట్లు ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. కానీ టికెట్ల ప్రకటన విషయంలో సీనియర్ నాయకులే తలా ఒక మాట మాట్లాడుతుండటంతో పరిస్థితి మరింత గందరగోళానికి దారి తీస్తోంది. తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క పక్క పక్కనే కూర్చొని పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేయడం కార్యకర్తలను అయోమయానికి గురి చేసింది.

తెలంగాణ అసెంబ్లీ స్థానాల కోసం అభ్యర్థుల కసరత్తు కొలిక్కి వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సు యాత్ర త్వరలోనే ప్రారంభమవుతుందని రేవంత్ తెలిపారు. అయితే టికెట్లు యాత్రకు ముందుగానే ప్రకటించడమా.. లేదంటే యాత్ర మధ్యలో ప్రకటించడమా అనే విషయంపై స్పష్టత వచ్చాక చెబుతామని అన్నారు. ఆయన పక్కనే కూర్చున్న భట్టి విక్రమార్క మాత్రం త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఇద్దరు నాయకులు ఒకే సమావేశంలో కూర్చొని.. పరస్పరం విరుద్దమైన ప్రకటనలు చేయడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తెరతీసింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం భారీగా పోటీ నెలకొన్నది. ముఖ్యంగా కొంత మంది నాయకులు తమ కుటుంబీకుల కోసం కూడా టికెట్లు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా చేరి వాళ్లు కూడా రెండు, మూడు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి సీనియర్లు తమ అనుచరులకు టికెట్లు కేటాయించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇంతటి గందరగోళం ఉండటంతోనే సీనియర్లు పరస్పరం విరుద్దమైన ప్రకటనలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. సీనియర్లు ఎంత త్వరగా విభేదాలు పక్కన పెట్టి జాబితాపై ఏకాభిప్రాయానికి వస్తే అంత మంచిదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చేయడంతో త్వరగా ప్రచారంలోకి దిగితేనే కాంగ్రెస్‌కు మంచిదనే అభిప్రాయం వెలువడుతోంది.

First Published:  11 Oct 2023 7:06 AM IST
Next Story