Telugu Global
Telangana

జగన్ ఫార్ములాను కాంగ్రెస్ ఫాలో అవుతున్నదా ?

మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్‌ అనుస‌రిస్తున్న కొత్త తరహా విధానం ఏమిటంటే గడపగడపకు కాంగ్రెస్.. పార్టీ సీనియర్లు కచ్చితంగా ప్రతి ఓటరును ఇంటికి వెళ్ళి కాంగ్రెస్‌కు ఓటు వేయమని అభ్యర్ధించాల్సిందే అని రేవంత్ తీర్మానించార‌ట‌.

జగన్ ఫార్ములాను కాంగ్రెస్ ఫాలో అవుతున్నదా ?
X

కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న డెవలప్‌మెంట్స్‌ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం అన్నీ పార్టీలు శక్తివంచన లేకుండా పోరాడుతున్న విషయం అందరు చూస్తున్నదే. పోటీలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే ప్రధాన పార్టీలన్న విషయం తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టి బలమే ఉన్నా అదంతా ఇప్పుడు చరిత్రగా మారిపోయింది. ఎలాగైనా గెలిచి పూర్వవైభవాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గ‌ట్టి ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే పార్టీ నేతలు, శ్రేణులంతా కొత్త తరహాలో ప్రచారం చేయాలని చెప్పారట. ఇంతకీ ఆ కొత్త తరహా ఏమిటంటే గడపగడపకు కాంగ్రెస్ అనే విధానం. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే కచ్చితంగా ప్రతి ఓటరును ఇంటికి వెళ్ళి ఓటు వేయమని అభ్యర్ధించాల్సిందే అని రేవంత్ తీర్మానించారట. ప్రతి ఓటరును కలిస్తే కానీ గెలిచే అవకాశాలు లేవని కూడా సీనియర్ నేతలకు చెప్పారట. ఇందుకోసం పార్టీలోని సీనియర్లందరినీ మునుగోడులో దింపాలని డిసైడ్ అయ్యారట.

ప్రతి గ్రామానికి ఒక సీనియర్‌ను ఇన్‌చార్జిగా నియమించబోతున్నారు. అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి ప్రచారం చేయటం, రోడ్డు షోలు చేస్తుండటంతో సీనియర్లకు సంబంధంలేదట. అంటే అభ్యర్ధి ప్రచారం అభ్యర్ధిదే.. సీనియర్ల గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం సీనియర్లదే. గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం అంటేనే ఏపీలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమం గుర్తుకు రావటంలేదా ? ఓటర్ల మనసులు గెలుచుకోవాలంటే ప్రతి మంత్రి, ఎంఎల్ఏ గడగగడప తొక్కాల్సిందే, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించాల్సిందే అని జగన్ చెబుతున్న విషయం తెలిసిందే.

ఇపుడు అదే ఫార్ములాను మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అప్లై చేయబోతోందట. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, బీజేపీ మీదున్న అసంతృప్తిని గడపగడపకు కాంగ్రెస్ ప్రచారంలో సీనియర్లందరు గట్టిగా వివరించాలని రేవంత్ చెప్పారట. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు గాంధీభవన్‌లో బ్లూ ప్రింట్ కూడా రెడీ చేస్తున్నట్లు సమాచారం. మరి రేవంత్ ప్లాన్ వర్కవుటవుతుందా ? అన్నది కాలమే నిర్ణయించాలి.

First Published:  7 Oct 2022 6:37 PM IST
Next Story