Telugu Global
Telangana

ప్లీజ్ వెళ్లొద్దు.. నేతలను బతిమిలాడుతున్న తెలంగాణ కాంగ్రెస్

చేరిక విషయంలో జానారెడ్డి కమిటీని టీపీసీసీ ఏర్పాటు చేసింది. అసలు విషయం ఏమిటంటే.. ఇంత వరకు ఆ కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని జానారెడ్డికి కూడా చెప్పలేదు.

ప్లీజ్ వెళ్లొద్దు.. నేతలను బతిమిలాడుతున్న తెలంగాణ కాంగ్రెస్
X

తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కు పడుతోంది. యువ నాయకుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌లో కాస్త ఊపు వచ్చింది. ఇకపై భారీగా చేరికలు ఉంటాయని పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. జానారెడ్డి నేతృత్వంలో ఏకంగా చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల్లోకి కీలక నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకొని వస్తున్నామంటూ ప్రచారం కూడా చేసుకున్నారు. తీరా చూస్తే ఉన్న నాయకులను కూడా కాపాడుకోలేక పోతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల విషయంలో 'ఎవరికి వారే యమునా తీరే' చందంగా వ్యవహరించడం వల్ల అసలుకే మోసం వస్తోంది. కాంగ్రెస్‌లో చేరిక‌తో తమ భవిష్యత్ ఎలా ఉంటుందనేది వివరించడంలో నేతలు విఫలం కావడం కూడా ఓ కారణమే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నది. ఇలాంటి పార్టీలో చేరి రాజకీయ భవిష్యత్‌ను అంధకారం చేసుకోవడం ఎందుకనే భావన ఇతర పార్టీ నేతల్లో కనపడుతున్నది.

ఇటీవల రేవంత్ రెడ్డి సీక్రెట్ ఆపరేషన్ అంటూ ఒకరిద్దరు నేతలను ఢిల్లీ తీసుకెళ్లి పార్టీ కండువా కప్పించారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్యను టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి రప్పించారు. దీంతో కాంగ్రెస్‌లో ఒక్కసారిగా ఊపొచ్చింది. ఇకపై చేరికలు భారీగా ఉంటాయని అందరూ భావించారు. కానీ ఆ జంట చేరిన నాలుగు నెలలకే తిరిగి కారు పార్టీలోకి జంప్ అయ్యింది. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలు చేయాలని కేసీఆర్ నిర్ణయించడంతో విస్తృతమైన అవకాశాలు ఉంటాయని భావించి చాలా మంది తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు.

గతంలో ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఆయన బీజేపీలో చేరిపోయారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కాపాడుకోవడంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. డి. శ్రీనివాస్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొని రావాలని విఫలయత్నాలు చేశారు. రేవంత్ రెడ్డి తాను చేసే పనులను ఇతర నాయకులతో పంచుకోకపోవడం వల్లే ఇలా ప్రతీసారి విఫలం అవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నల్లాల ఓదెలు విషయంలో పూర్తి బాధ్యత రేవంత్‌దే అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక వేరే పార్టీ నుంచి ఎవరైనా నాయకుడు పార్టీలో చేరదామని అనుకున్నా.. స్థానిక కాంగ్రెస్ నేతలు అడ్డుపుల్లలు వేస్తున్నట్లు రేవంత్ గ్రహించారు. కానీ వాళ్లు సీనియర్లు కావడంతో రేవంత్ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది.

చేరిక విషయంలో జానారెడ్డి కమిటీని టీపీసీసీ ఏర్పాటు చేసింది. అసలు విషయం ఏమిటంటే.. ఇంత వరకు ఆ కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని జానారెడ్డికి కూడా చెప్పలేదు. దీంతో ఆయన ఎలాంటి బాధ్యతలు తీసుకోకుండా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను కాంగ్రెస్‌లోకి రేవంత్ తీసుకొని వచ్చారు. అయితే ముందస్తుగా తనకు సమాచారం ఇవ్వలేదని భట్టి విక్రమార్క ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో చేరిన తాటి వెంకటేశ్వర్లు వ్యతిరేక వర్గాన్ని భట్టి ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన తిరిగి టీఆర్ఎస్‌లోకి వెళ్తానని చెబుతుండటంతో రేవంత్ మాత్రం బతిమిలాడుకుంటున్నట్లు తెలుస్తున్నది. పీజేఆర్ కూతురు కాంగ్రెస్‌లో చేరడంతో దాసోజు శ్రవణ్ బీజేపీలోకి వెళ్లిపోయారు. అలాంటి సీనియర్ నేతను ఆపాలని ప్రయత్నించకపోవడంపై పార్టీలో తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

మునుగోడులో కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన సమయంలో కాంగ్రెస్ నేతలెవరూ పెద్దగా వెంట వెళ్లలేదు. కానీ ఇప్పుడు పలు తాయిలాల ఆశ చూపిస్తుండటంతో పార్టీని వీడుతున్నట్లు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలు వలసలను ఆపాలని ప్రయత్నిస్తున్నా ఎవరూ మాట వినడం లేదని సమాచారం. ఒక్క మునుగోడు మాత్రమే కాకుండా చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి వలసలు ఆపడం టీపీసీసీ సీనియర్లకు కష్టంగా మారింది.

First Published:  7 Oct 2022 9:25 AM IST
Next Story