అప్లికేషన్ల హడావిడి.. కాంగ్రెస్ కి లాభమేంటి..?
పోనీ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా అప్లికేషన్లు వడపోసి టికెట్లు ఇస్తుందనే అనుకుందాం. చివరి నిమిషంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి టికెట్ ఖాయం కాక పెద్ద స్థాయి నేతలు కాంగ్రెస్ గూటికి వస్తే వారిని కూడా అప్లికేషన్ అడుగుతారా..? గడువైపోయింది మా పార్టీలో ఇక అప్లికేషన్లు తీసుకోరు అని మొహంపైనే చెప్పేస్తారా..?
తెలంగాణ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోంది. అభ్యర్థుల్ని ఖరారు చేయడంలో బీఆర్ఎస్ స్పీడ్ గా ఉంది. ఆ పార్టీలోని అసంతృప్తులకు గేలమేసేందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధంగా ఉన్నాయి. చాలా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ కి సరైన అభ్యర్థులు లేరనేది వాస్తవం. బీఆర్ఎస్ టికెట్లు ఖాయం చేస్తే అసంతృప్తితో గోడదూకే వారికి ఆ రెండు పార్టీలు రెడ్ కార్పెట్ పరుస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్ మాత్రం అప్లికేషన్లు అంటూ హడావిడి మొదలు పెట్టింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవాలంటున్నారు. తాను కూడా దరఖాస్తు చేసుకుంటేనే టికెట్ వస్తుందని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
ఎందుకీ అప్లికేషన్లు..?
అసలు పార్టీలో టికెట్ కోసం అప్లికేషన్ ఏంటి..? అంటే అప్లికేషన్లో పొందు పరిచిన వివరాలనే పార్టీ పరిగణలోకి తీసుకుంటుందా..? పోనీ దరఖాస్తులో అద్భుతమైన క్వాలిటీస్ ఉంటే నిజంగానే పనైపోతుందా..? లేదా తమ పార్టీలో నియోజకవర్గానికి ఇంతమంది పోటీపడుతున్నారని కాంగ్రెస్ గొప్పగా చెప్పాలనుకుంటోందా..? అసలు అప్లికేషన్లతో తెలంగాణ కాంగ్రెస్ ఏం సాధించాలనుకుంటోంది..? ఇదే ఇప్పుడు సమాధానం లేని పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
ఆత్మ సంతృప్తి..
"అంతర్గత ప్రజాస్వామ్యానికి మా పార్టీ పెట్టింది పేరు, మా పార్టీలో అంతా పద్ధతి ప్రకారం జరుగుతుంది, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు." అని చెప్పుకోడానికే ఈసారి కాంగ్రెస్ అప్లికేషన్ల పద్ధతి తెరపైకి తెచ్చింది. సీటు రానివాళ్లు ఎవరైనా గొడవ చేస్తే వారికి అప్లికేషన్ తో సమాధానం చెప్పే ఆలోచన కూడా అధినాయకత్వానికి ఉంది. అయితే ఇది కేవలం ఆత్మ సంతృప్తికోసమే కానీ, ఇందులో రాజకీయ వ్యూహం ఏదీ లేదని, ఉన్నా వర్కవుట్ కాదనేది విశ్లేషకుల వాదన. కాంగ్రెస్ అప్లికేషన్లతో అసలు ప్రజలకు సంబంధం ఏమీ లేదు, ఒక్క ఓటు కూడా ఈ వ్యూహంతో పెరిగే ఛాన్స్ లేదు. మరి హడావిడిగా అప్లికేషన్లు, వాటికి రుసుములు.. అన్నీ ఎందుకనే ప్రశ్నలు ప్రజల నుంచి కూడా వినపడుతున్నాయి.
చివరి నిమిషంలో ట్విస్ట్ లు ఉండవా..?
పోనీ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా అప్లికేషన్లు వడపోసి టికెట్లు ఇస్తుందనే అనుకుందాం. చివరి నిమిషంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి టికెట్ ఖాయం కాక పెద్ద స్థాయి నేతలు కాంగ్రెస్ గూటికి వస్తే వారిని కూడా అప్లికేషన్ అడుగుతారా..? గడువైపోయింది మా పార్టీలో ఇక అప్లికేషన్లు తీసుకోరు అని మొహంపైనే చెప్పేస్తారా..? కీలక నేతలు వస్తే అప్లికేషన్లతో అవసరం ఏముంటుంది..? ఎంచక్కా చివరి నిమిషంలో కూడా కండువా కప్పేసి బి-ఫామ్ ఇచ్చేస్తారు. అంత మాత్రానికి ఈ అప్లికేషన్ల హడావిడి ఎందుకంటూ కాంగ్రెస్ పై సెటైర్లు పేలుతున్నాయి.