ఇంటర్నెట్ ఫ్రీ.. తెలంగాణలో కాంగ్రెస్ మరో హామీ
ఆరు హామీలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు శ్రమిస్తున్నారు. ఇక మేనిఫెస్టో కమిటీ కొత్త హామీలను తెరపైకి తెస్తోంది. అందులో ముఖ్యమైనది ఉచిత ఇంటర్నెట్.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉచితాలను బాగా నమ్ముకుంది. కర్నాటకలో ఈ ఉచితాలతోనే గట్టెక్కడంతో అవే హామీలు ఇక్కడ కూడా వర్కవుట్ అవుతాయని ఆశిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఈ ఆరు హామీలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు నేతలు శ్రమిస్తున్నారు. ఇక మేనిఫెస్టో కమిటీ కొత్త హామీలను తెరపైకి తెస్తోంది. అందులో ముఖ్యమైనది ఉచిత ఇంటర్నెట్.
ఇంటర్నెట్ ఉచితం అంటే.. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అనుకుంటే పొరపాటే. కేవలం విద్యార్థులకు మాత్రమే. అవును, తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ ఉచిత ఇంటర్నెట్ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించారు కాంగ్రెస్ నేతలు. గాంధీభవన్ లో సమావేశమైన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది మేనిఫెస్టో కమిటీ. ఆటో డ్రైవర్ల సంఘాలతో సమావేశమై దీనికి సంబంధించి సమాచారం సేకరిస్తారు. వారికి ఎలాంటి పథకాలు ఉపయోగపడతాయో తెలుసుకుని, వాటిపై చర్చించి మేనిఫెస్టోలో పెడతారు.
విస్తృత పర్యటనలు..
తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి శ్రీధర్ బాబు చైర్మన్ గా ఉన్నారు. ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, ప్రసాద్ కుమార్ తదితరులు ఇందులో సభ్యులు. వివిధ వర్గాల నుంచి సూచనలు, ప్రతిపాదనలను ఈ కమిటీ స్వీకరిస్తోంది. అక్టోబరు 2 నుంచి కమిటీ సభ్యులు జిల్లాల్లో పర్యటిస్తారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ సూటిగా ఒకే ప్రశ్న అడుగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలన్నీ ఎందుకు అమలు కావడంలేదని అడుగుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒకవేళ కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న పథకాలు అంత ఉపయోగకరం అనుకుంటే.. ముందుగా ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో వాటిని అమలు చేస్తామని చెప్పాలని, ఆ తర్వాతే తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయాలని అంటున్నారు. దీనికి మాత్రం కాంగ్రెస్ వద్ద సమాధానం లేదు.
♦