Telugu Global
Telangana

కేంద్రం ప్రకటించిన యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ పూర్తి చేయనున్న‌ తెలంగాణ

వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో దాదాపు 1.30 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి ఉంటుంది. అందువల్ల‌ కేంద్రం నిర్దేశించిన 80 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవడం అత్యంత సులభమని పౌరసరఫరాల శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

కేంద్రం ప్రకటించిన యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ పూర్తి చేయనున్న‌ తెలంగాణ
X

ఈ యాసంగి సీజన్‌లో వరి ధాన్యం సేకరణ కోసం కేంద్రం తెలంగాణకు విధించిన లక్ష్యాన్ని చాలా సులభంగా పూర్తి చేస్తామని వ్యవసాయ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గత యాసంగి సీజన్‌లో కేంద్రం తెలంగాణ నుంచి 60 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ సీజన్‌లో ఆ లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచింది.

వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో దాదాపు 1.30 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి ఉంటుంది. అందువల్ల‌ కేంద్రం నిర్దేశించిన 80 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవడం అత్యంత సులభమని పౌరసరఫరాల శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

ఏడాదికేడాది రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడులు భారీగా పెరుగుతున్నాయి. 2014-15లో వరి సేకరణకు రూ.3,392 కోట్లు ఖర్చు చేయగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో దీనిని రూ.26,600 కోట్లకు పెంచారు. ఇది రాష్ట్రంలో వరి సాగు, దిగుబడుల పెరుగుదలను రుజువు చేస్తుంది.

శుక్రవారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఈ సీజన్‌లో కొనుగోళ్లను సమీక్షించి యాసంగి సీజన్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు.

ఈ సీజన్‌లో ఏప్రిల్‌ 11న రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 90 వేల టన్నుల వరిని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు సేకరించిన వరి మొత్తం విలువ రూ.186 కోట్లు అని గంగుల కమలాకర్‌ తెలిపారు.

మొత్తం 7,100 కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం వరకు 1,131 కేంద్రాలను ప్రారంభించిన అధికారులు కొనుగోళ్లు చేస్తున్నారు.

అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ముఖ్యంగా టార్పాలిన్‌లు, గన్నీ బ్యాగులు, తేమ యంత్రాలు, హమాలీలను కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేశామని కమలాకర్ తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు చేరవేయాలని ఆయన సూచించారు. .

First Published:  22 April 2023 8:25 AM IST
Next Story