లోక్ సభ ఎన్నికలకు ముందు రేవంత్ మాస్టర్ ప్లాన్
లబ్ధిదారులకు అందించే నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు సిద్ధం చేయాలంటూ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఏమేరకు మేలు చేశాయో తెలియదు కానీ, లోక్ సభ ఎన్నికలకు మాత్రం ముందస్తు తాయిలంగా పనిచేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల వేళ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆరు గ్యారెంటీలనే నమ్ముకుంది. అయితే అప్పుడు కేవలం ప్రకటిస్తే, ఇప్పుడు అమలు బాధ్యత భుజానికెత్తుకుంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ నెల 11నుంచి ఇందిరమ్మ ఇళ్లు..
ఇందిరమ్మ రాజ్యం అంటూ అసెంబ్లీ ఎన్నికల వేళ ఊరించిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చాక ఆమె పేరుతో తొలి పథకాన్ని మొదలు పెట్టబోతున్నారు. గతంలో ఉన్నదే అయినా.. ఇందిరమ్మ ఇళ్లు అనే పేరు ఇప్పుడు సరికొత్తగా తెరపైకి వస్తోంది. ఈ పథకం విధి విధానాలకు సంబంధించి సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి.
స్థలం ఉన్నా లేకున్నా..
ఖాళీ స్థలం ఉండి, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోరుకునే వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రూ.5లక్షలు అందిస్తారు. స్థలం లేకపోతే తొలి విడతలో.. ప్రభుత్వమే వారికి జాగా చూపిస్తుంది. మలి విడతలో ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేస్తుంది. లబ్ధిదారులకు అందించే నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు సిద్ధం చేయాలంటూ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. తొలి దశలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3,500 ఇళ్లు మంజూరు చేయాలని తీర్మానించారు.
బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జోరుగా సాగింది. లాటరీ పద్ధతిలో ఇళ్లు కేటాయించినా కొన్నిచోట్ల స్థానికుల్లో అసంతృప్తి బయటపడింది. ఉచిత ఇళ్ల నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచడం ప్రభుత్వాలకు సాధ్యమయ్యే పని కాదు. మరి ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ కి ఏ స్థాయిలో మేలు చేస్తుందో చూడాలి.