కీరవాణి ఇష్యూతో నాకు సంబంధం లేదు.. అందెశ్రీ ఇష్టం - రేవంత్ రెడ్డి
కీరవాణి వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు రేవంత్ రెడ్డి. గీత రచయిత అందెశ్రీకే సంగీతాన్ని సమకూర్చుకునే బాధ్యత అప్పజెప్పామన్నారు.
తెలంగాణ గీతానికి సంగీతం కూర్చే అంశంపై వివాదం నడుస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కీరవాణి వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు రేవంత్ రెడ్డి. గీత రచయిత అందెశ్రీకే సంగీతాన్ని సమకూర్చుకునే బాధ్యత అప్పజెప్పామన్నారు. కీరవాణిని అందెశ్రీనే ఎంపిక చేశారన్నారు రేవంత్ రెడ్డి. అందులో తనకు ఎలాంటి పాత్ర లేదన్నారు. తెలంగాణ దశాబ్ధి వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించేందుకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి...అక్కడి మీడియాతో చిట్‌చాట్ చేశారు.
తెలంగాణ చిహ్నం మార్పుపైనా వివరణ ఇచ్చారు రేవంత్. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం అన్నారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తుకు వస్తాయన్నారు రేవంత్. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ ఉండదన్న రేవంత్...సమ్మక్క, సారక్క, నాగోబా జాతర స్ఫూర్తితో చిహ్నం ఉంటుందన్నారు. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా చిహ్నం ఉంటుందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పూర్తి వ్యవహారాన్ని అధికారులే చూసుకుంటున్నారని చెప్పారు. తాను ఫోన్ ట్యాపింగ్ చేయించడం లేదన్నారు. కాళేశ్వరంపై నిపుణుల సూచన మేరకు ముందుకు వెళ్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు లేవన్న రేవంత్ రెడ్డి..కొన్ని చోట్ల వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగి ఉండొచ్చన్నారు. తెలంగాణలో పారదర్శకంగా పాలన నడుస్తోందన్నారు. విపక్షాలకు విమర్శించే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు మాట్లాడాల్సి ఉందన్నారు రేవంత్ రెడ్డి.