Telugu Global
Telangana

కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. అసలు విషయం ఏంటంటే..?

పీఎంఏవై బకాయిలను విడుదల చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. స్మార్ట్‌సిటీ పథకం కాలపరిమితిని మరో ఏడాది పొడిగించాలన్నారు.

కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. అసలు విషయం ఏంటంటే..?
X

బీజేపీతో రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయని, మోదీ-రేవంత్.. బడే భాయ్, చోటే భాయ్ అంటూ.. బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవకాశం వస్తే మాత్రం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల్ని కలసి వినతిపత్రాలు అందిస్తూనే ఉన్నారు. కేంద్రం మాట విన్నా, వినకపోయినా తమ తప్పు లేకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు సీఎం రేవంత్. తాజాగా ఆయన ఢిల్లీలో ఇద్దరు కేంద్ర మంత్రుల్ని కలిశారు. తెలంగాణ తరపున వినతిపత్రాలు ఇచ్చారు.


ఇళ్ల మంజూరుకోసం..

అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చుకోడానికి ఇప్పుడు కేంద్రం సాయం కోరుతున్నారు రేవంత్ రెడ్డి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలిసిన ఆయన తెలంగాణకు 2.70 లక్షల పట్టణ ఇళ్లను మంజూరు చేయాలని అభ్యర్థించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటివరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి, రూ.2,390.58 కోట్లు గ్రాంటుగా ప్రకటించారని, వాటిలో రూ.1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగతా నిధులనూ విడుదల చేయాలని కోరారు. స్మార్ట్‌సిటీ పథకం కాలపరిమితిని మరో ఏడాది పొడిగించాలన్నారు రేవంత్ రెడ్డి.


రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ కోసం రక్షణ శాఖకు చెందిన 2,450 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని విన్నవించారు. రావిర్యాలలో తెలంగాణకు చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్‌ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఐ) ఉపయోగించుకుంటోందని, దానికి బదులుగా 2,450 ఎకరాల రక్షణ శాఖ భూములను తెలంగాణకు ఇవ్వాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్‌కు సైనిక పాఠశాలను మంజూరు చేయాలని కూడా వినతిపత్రం అందించారు. ఆయన వెంట కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు.

First Published:  25 Jun 2024 7:13 AM IST
Next Story