ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్న రేవంత్.. త్వరలో భారీ వడ్డన
జీఎస్టీ ఎగవేత ఉండకూడదని, జీఎస్టీ ఆదాయం పెంచేందుకు పక్కాగా క్షేత్ర స్థాయి తనిఖీలు, పరిశీలనలు చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్.
తెలంగాణను అప్పుల కుప్పలా మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని తమకు అప్పగించి వెళ్లిందనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ. అయినా కూడా ప్రజలకు హామీ ఇచ్చినవన్నీ నెరవేరుస్తామని ఆయన పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలు కాచుకుంటూ కొత్త డెడ్ లైన్లు ప్రకటిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇకపై అలా సర్దిచెప్పుకునే పరిస్థితి కనపడ్డంలేదు. అందుకే కొత్త ఆదాయ మార్గాలను ఆయన అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ముందు రిజిస్ట్రేషన్ శాఖపై ఆయన దృష్టిసారించారు.
రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల ఉన్నతాధికారులతో గురువారం సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. మార్కెట్ విలువకు అనుగుణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా వాటిని సవరించే ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని సీఎం అధికారులకు గుర్తు చేశారు. మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ, విక్రయ రేట్లకు పొంతన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని వివరించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని రాబడి సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
జీఎస్టీ ఎగవేత ఉండకూడదని, జీఎస్టీ ఆదాయం పెంచేందుకు పక్కాగా క్షేత్ర స్థాయి తనిఖీలు, పరిశీలనలు చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించొద్దన్నారు. కచ్చితంగా పన్ను వసూలు జరగాల్సిందేనన్నారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని చెప్పారు. ఇక మద్యం అమ్మకాల్లో కూడా ఆదాయం పెంచాలన్నారు. విక్రయాలు పెరిగినా, ఆదాయం పెరగడంలేదని చెప్పారు. ఇసుక ద్వారా కూడా ఆదాయం పెరగాలని కూడా సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి సంక్షేమ పథకాల అమలుకోసం అదనపు ఆదాయ మార్గాలను సీఎం అన్వేషిస్తున్నట్టు, వాటిని ఆచరణలో పెట్టబోతున్నట్టు అర్థమవుతోంది. పన్నులు పెరిగి ఆదాయం పెరిగినా, పన్నుల విషయంలో ఆయా వర్గాలు ఇబ్బంది పడితే మాత్రం ప్రతిపక్షాల విమర్శలను కూడా తట్టుకోవాల్సి వస్తుంది.