Telugu Global
Telangana

చంద్రబాబు కోరితే ఆ పని చేస్తా -రేవంత్ రెడ్డి

ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని అన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు.

చంద్రబాబు కోరితే ఆ పని చేస్తా -రేవంత్ రెడ్డి
X

ఎన్డీఏ కూటమి గెలుపుని ఇండియా కూటమి హర్షిస్తుందా..? ఎన్డీఏ కూటమిలోని పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ కి చెందిన నాయకుడు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతారా..? మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ఆహ్వానిస్తే తాను కచ్చితంగా ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తానని చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

ప్రాంతీయ పార్టీల్లో ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోవడం సహజం. కానీ ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు దాదాపుగా అలాంటి పనులు చేయవు. సమయానికూలంగా అలా చేతులు కలుపుతూ పోతే కేడర్ కి తప్పుడు సంకేతాలిచ్చినట్టవుతుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పోరాటం చేసింది. ఏపీలో కూడా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ దశలో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రతినిధిగా చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తనను ఆహ్వానిస్తే వెళ్తానంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానని కూడా చెప్పారాయన. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.

ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు..

ఏపీ ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అనుకున్నా కూడా.. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక హామీ ఇచ్చింది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. ఈ విషయంపై రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని అన్నారాయన. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఈ విషయంపై తమ పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతామని కూడా అన్నారు రేవంత్‌ రెడ్డి.

First Published:  5 Jun 2024 9:50 AM GMT
Next Story