Telugu Global
Telangana

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన దసరాకు లేనట్లేనా?

జాతీయ పార్టీకి సంబంధించిన ఎజెండా, విధివిధానాలతో పాటు లోగో, జెండా తదితర పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వీటి కోసం కేసీఆర్ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతూ జాతీయ పార్టీకి ఓ తుదిరూపం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన దసరాకు లేనట్లేనా?
X

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటులో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులతో ముచ్చటించి పార్టీకి ఓ తుది రూపం తీసుకొని వచ్చే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఫ్రంట్‌లతో అనుకున్న లక్ష్యం నెరవేరదని.. పార్టీనే సరైన పరిష్కారం అని కేసీఆర్ మొదటి నుంచి నమ్ముతున్నారు. దసరా పండుగ రోజు కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తారని మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. పార్టీ ప్రకటన మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దసరా రోజు కొత్త పార్టీ ప్రకటన కష్టమేనని తెలుస్తున్నది. దసరాకు కాకుండా డిసెంబర్‌లో పార్టీ ప్రకటన ఉండబోతున్నట్లు సమాచారం.

జాతీయ పార్టీకి సంబంధించిన ఎజెండా, విధివిధానాలతో పాటు లోగో, జెండా తదితర పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వీటి కోసం కేసీఆర్ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతూ జాతీయ పార్టీకి ఓ తుదిరూపం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇవన్నీ ఫైనలైజ్ అయ్యాక కేంద్ర ఎన్నికల కమిషన్‌తో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉన్నది. అయితే ముందుగా అనుకున్న మేరకు పనులు తుది దశకు చేరుకోక పోవడంతో పార్టీ ప్రకటనను మరి కొన్ని వారాలు వాయిదా వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో పార్టీ ప్రకటించి ప్రజలను అయోమయానికి గురి చేసే బదులు.. డిసెంబర్‌లో అయితే బాగుంటుందని కొందరు సీనియర్ నేతలు కూడా కేసీఆర్‌కు సలహా ఇచ్చినట్లు సమాచారం.

జాతీయ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కూడా కాలేదు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీలో విలీనం చేయాల్సిన తీర్మానం కూడా ఇంకా సిద్ధం కాలేదు. పార్టీ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం నిర్వహించి, అక్కడ ఆమోదం తీసుకున్న తర్వాత ఆ ప్రతిని ఎన్నికల కమిషన్‌కు అందించాల్సి ఉంటుంది. అయితే టీఆర్ఎస్ పార్టీని తప్పకుండా విలీనం చేయాలా? లేదంటే జాతీయ పార్టీని విడిగా నడిపించాలనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ ప్రక్రియ అంతా దసరా లోపు పూర్తి కాదు. అందుకే పార్టీ ప్రకటన ఆలస్యం అవుతోందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

ఇక కొత్త జాతీయ పార్టీలో ఎలాంటి హామీలు ఇవ్వాలనే విషయంపై కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఆదరణ పొందిన వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోళ్లను అజెండాలో చేర్చనున్నారు. ఈ పథకాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. జాతీయ పార్టీ రైతు ఫ్రెండ్లీగా ఉంటుందని ప్రజలకు భ‌రోసా కల్పించనున్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దళిత, గిరిజన, ఆదివాసీలకు కూడా పూర్తి స్థాయి హక్కుల కోసం ఉద్యమం చేస్తామని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నది. కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో యూపీ లేదా పంజాబ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. డిసెంబర్‌లో ప్రకటన చేసి.. జనవరిలో భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనేది కేసీఆర్ వ్యూహంగా ఉన్నది. అయితే, దసరాకు కొత్త పార్టీ ప్రకటన చేస్తారనే ఉత్సాహంలో ఉన్న టీఆర్ఎస్ క్యాడర్.. ఈ వార్త తెలిసి కాస్త డీలా పడ్డారు. ఏదేమైనా కొత్త జాతీయ పార్టీ విషయంలో మాత్రం కేసీఆర్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ, ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

First Published:  22 Sept 2022 8:14 AM IST
Next Story