కేసీఆర్ ఎన్నికల వ్యూహం... మళ్లీ ఆత్మగౌరవ నినాదమే
సరిగ్గా ఐదేండ్ల క్రితం `కాళేశ్వరం ఎత్తిపోతల పథకం` దాదాపుగా పూర్తి కావొచ్చింది. 2019లో జరగాల్సిన సాధారణ ఎన్నికల ప్రక్రియను బ్రేక్ చేశారు కేసీఆర్. అలా ఏం చేసినా ఆయనకే చెల్లు.
గౌరవం.. ఆత్మ గౌరవం.. సార్వభౌమాధికారం.. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపించిన వినిపిస్తున్న పదాలు.. ఆధిపత్యాన్ని, అధికారాన్ని కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు, నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొస్తున్న నినాదాలు.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. కేసీఆర్ అందులో ముందే ఉంటారు. 22 ఏండ్ల క్రితం కొందరు మేధావుల మద్దతుతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్థాపించారు. నాటి నుంచి 13 ఏండ్ల పోరాటం తర్వాత 2014లో సొంత తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. 2014లో సాధారణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తొమ్మిదేండ్ల తర్వాత మళ్లీ ఆత్మ గౌరవ సెంటిమెంట్ రగిల్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగమే `తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు`. జూన్ రెండో తేదీ మొదలు 21 రోజులు రాష్ట్రమంతా ఆత్మగౌరవ నినాదం మార్మోగాలన్నది తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది.
వచ్చే నవంబర్ లేదా డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సొంత రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్నారు కేసీఆర్. నీళ్లూ.. నిధులు .. నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణలో `కాళేశ్వరం ఎత్తిపోతల పథకం` కింద రాష్ట్రమంతటా సాగునీటి వసతులు మెరుగయ్యాయి. సొంత రాష్ట్రంలో మిగులు నిధులతో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు కేసీఆర్.
ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి.. జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రోడ్ల నిర్మాణం పటిష్టం చేశారు. గురుకులాల పేరుతో పేద, బలహీన, అల్ప సంఖ్యాక వర్గాల పిల్లలకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్య అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రానికే తలమానికంగా బాసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి పరిమితమైన ఐటీ రంగ సేవలు జిల్లా కేంద్రాలకు విస్తరిస్తున్నాయి.
తెలంగాణ ఆవిర్భావ సమయంలో అప్పటికే అధికారం మత్తులో ఉన్న కాంగ్రెస్ నేతలు మళ్లీ అధికారం తమకే వస్తుందన్న ఊహల మధ్య ఊగిసలాడుతుంటే వ్యూహాత్మకంగా తెలంగాణ సబ్బండ వర్ణాల ప్రజల మద్దతు కూడగట్టడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. 2014 ఎన్నికల ప్రచారం వేళ తెలంగాణ ఆత్మను తట్టి లేపారు. ఫలితంగా సాధారణ మెజారిటీతో అధికారం సొంతం చేసుకున్నది టీఆర్ఎస్. అటుపై సొంత రాష్ట్ర అభివృద్ధి పేరిట తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను `సొంతం రాష్ట్రం-సొంత పార్టీ` నినాదంతో టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చారు.
సరిగ్గా ఐదేండ్ల క్రితం `కాళేశ్వరం ఎత్తిపోతల పథకం` దాదాపుగా పూర్తి కావొచ్చింది. 2019లో జరగాల్సిన సాధారణ ఎన్నికల ప్రక్రియను బ్రేక్ చేశారు కేసీఆర్. అలా ఏం చేసినా ఆయనకే చెల్లు. ఫలితంగా 2018 నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కసితో ఉన్న నాటి ఏపీ సీఎం, ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టారు. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నినాదాన్ని నిషేధించిన చంద్రబాబు.. తర్వాత అవసరార్థం తెలంగాణ అనుకూల నినాదం ఇచ్చినా.. ఆచరణలో భిన్నంగా వ్యవహరించారు. 2018లో తిరిగి తెలంగాణలో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు. దీన్ని అనుకూలంగా మార్చుకున్నారు కేసీఆర్. `శనేశ్వరమా`, `కాళేశ్వరమా` అని కాలికి బలపం కట్టుకుని మరీ తెలంగాణ అంతటా ప్రచారం చేశారు. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి వస్తే ఆయన అడుగులకు మడుగులొత్తుతుందనే సంకేతాలిచ్చారు. కేసీఆర్ వాదాన్ని విశ్వసించారు సబ్బండ తెలంగాణ వర్ణాల ప్రజలు.
1982లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీతోనే హస్తం పార్టీ జట్టు కట్టడం తెలంగాణ ప్రజలకు నచ్చలేదు. ఫలితంగా ఖమ్మం జిల్లా మినహా ఎక్కడా కాంగ్రెస్ చెప్పుకోదగ్గ సీట్లు సంపాదించలేకపోయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మహామహులు మట్టి కరిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలుపొందడం మినహా నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు. ఇప్పటికే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల పోరాటం ముంగిట్లోకి వస్తున్నందున ఐక్యతారాగం ఆలాపిస్తున్నారే గానీ.. ఆధిపత్యం.. అధికారం అంటే అంతా పోటీలోకి దూసుకొస్తారన్నది జగమెరిగిన సత్యం.
సబ్బండ వర్ణాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నా.. వరుసగా రెండుసార్లు అధికారంలో కొనసాగినందున ప్రజా వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు గతేడాది వరకు టీఆర్ఎస్‌గా ఉన్న పార్టీ బీఆర్ఎస్ అవతారమెత్తింది. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలిగిపోయింది..అయినా.. తెలంగాణే తమ అస్తిత్వం అని చాటి చెప్పాలని సీఎం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు.. బీజేపీ పట్ల ప్రజల వ్యతిరేకత నేపథ్యంలో స్థానిక నాయకత్వం, ఆత్మ గౌరవ నినాదం ఓట్లు పండిస్తుందని బీఆర్ఎస్ అది నాయకత్వం వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకే వరుసగా రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ `ఆత్మ గౌరవ పతాకాన్నే` సబ్బండ తెలంగాణ ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్ల సంకల్పించారు. అందుకే ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. పేరిట ఏడాది పొడవునా ఉత్సవాలు జరిపినట్లు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.. దటీజ్ కేసీఆర్.