Telugu Global
Telangana

రూ. 6,250 కోట్లతో ఎయిర్‌పోర్ట్ మెట్రో.. డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్‌లోని మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు 31 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

రూ. 6,250 కోట్లతో ఎయిర్‌పోర్ట్ మెట్రో.. డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
X

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభించి సోమవారానికి (28 నవంబర్) ఐదేళ్లు పూర్తి అవుతున్న క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో లైన్‌కు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఇతర రంగాల్లో కూడా ముఖ్య కేంద్రంగా మారిన క్రమంలో చాలా మంది రెగ్యులర్‌గా నగరం నుంచి ఇతర నగరాలు, దేశాలకు విమాన ప్రయాణాలు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణించే వాళ్లు నగరం నుంచి త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో గతంలో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మించారు.

గతంలో అంచనా వేసిన దానికంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత నగరం అతి వేగంగా అభివృద్ధి చెందింది. ఐటీ, ఫార్మా, సినిమా రంగాల్లో ఉన్న వాళ్లతో పాటు తరచూ ఇతరులు కూడా విమాన ప్రయాణాలకు అలవాటు పడ్డారు. అదే సమయంలో పీవీఎన్‌ఆర్ ఫ్లై వోవర్ పై కూడా రద్దీ పెరిగింది. దీంతో ఐటీ సెక్టార్ నుంచి శంషాబాద్‌కు మెట్రో ఉండాలనే ప్రతిపాదన వచ్చింది.

మొదట్లో ఎంఎంటీఎస్‌ను శంషాబాద్ వరకు పొడిగించాలని భావించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపినా..కేంద్రం నియంత్రణలో ఉన్న రైల్వే శాఖ పెద్దగా స్పందించలేదు. దీంతో ప్రత్యామ్నాయాలు ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ మెట్రో లైన్ వేయాలని నిర్ణయం తీసుకున్నది.

హైదరాబాద్‌లోని మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు 31 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ. 6,250 కోట్లు ఖర్చు అవుతుందని కేటీఆర్ తన ట్వీట్‌లో చెప్పారు. ప్రస్తుతం నగరంలో మూడు లైన్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలోని నాగోల్ - రాయదుర్గం మధ్య ఉన్న లైన్ మైండ్ స్పేస్ వరకు వెళ్తుంది. ఇక ఇప్పుడు నిర్మించబోయే మెట్రో అక్కడి నుంచే ప్రారంభం కానుండటంతో ఐటీ ఎంప్లాయిస్‌కి మాత్రమే కాకుండా నగరంలోని ఇతర విమాన ప్రయాణికులకు కూడా ఉపయోగపడనుంది.



First Published:  27 Nov 2022 4:02 PM IST
Next Story