దర్గాకు 50కోట్ల నిధులు.. త్వరలో కేసీఆర్ చేతుల మీదుగా పనులు
దర్గా అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 30 ఎకరాల భూమిని సేకరించింది. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పనుల్ని మొదలు పెడతామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్.
శతాబ్దాల చరిత్ర ఉన్న జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి పనులకు త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఈ దర్గా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తరపున 50కోట్ల నిధులు మంజూరు చేశారు. హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని కొత్తూరులో ఉన్న జహంగీర్ పీర్ దర్గాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హజరత్ జహంగీర్ పీరాన్, హజరత్ బుర్హానుద్దీన్ అనే ఇద్దరు మత ప్రభోదకులు ఇస్లాం ప్రచారంలో భాగంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ నుండి అప్పట్లో ఇక్కడికి వచ్చారని చరిత్ర చెబుతోంది. వారిద్దరి సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటైన దర్గా ప్రముఖ పుణ్యస్థలంగా అలరారుతోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ ముల్ నర్వ గ్రామంలో ఈ దర్గా ఉంటుంది.
టూరిస్ట్ హబ్ గా..
ఈ ప్రముఖ దర్గాను టూరిస్ట్ హబ్ గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. దర్గా పరిసరాల్లో నియాజ్ ఖానా, సమా ఖానా, దుకాణాలు, వినోద సౌకర్యాలు, పార్క్ లు, కాటేజీలు, పార్కింగ్ ఏరియా, ఇంటర్నల్ రోడ్లకోసం రూ.50 కోట్లను బడ్జెట్ లో కేటాయించారు. దర్గా అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 30 ఎకరాల భూమిని సేకరించింది. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పనుల్ని మొదలు పెడతామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్.
కుల మతాలకు అతీతంగా శుక్రవారం ఈ దర్గాకు చాలామంది భక్తులు వస్తుంటారు. ఇతర రాష్ట్రాలనుంచి కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. అభివృద్ధి జరిగితే మరింత మంది రావడానికి అవకాశముందని స్థానికులంటున్నారు. టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. వీరి మాట మన్నించి తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 50కోట్ల రూపాయలు మంజూరు చేసింది. త్వరలో పనులు మొదలు కాబోతున్నాయి.