Telugu Global
Telangana

25న హర్యానాకు సీఎం కేసీఆర్?

కేంద్రంలో ఉన్న బీజేపీని గద్దె దించడానికి జాతీయ పార్టీ సన్నాహల్లో ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పటికే పలువురు నాయకులను కలిశారు. యాంటీ-బీజేపీ శక్తులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొని రావడానికి 'సమ్మాన్ దివస్' ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

25న హర్యానాకు సీఎం కేసీఆర్?
X

దేశంలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్న కేసీఆర్.. మరో కీలక పర్యటనకు సిద్ధపడుతున్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవీలాల్ జయంతి ఉత్సవాలకు కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 25న 'సమ్మాన్ దివస్' పేరుతో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్‌డీ) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కేసీఆర్‌తో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటికీ ఆహ్వానం అందింది. కాగా, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటే మాత్రం కేసీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున‌ ఎవరూ హాజరుకావడం లేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ వెళతారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా మాత్రం కేసీఆర్ పర్యటన ఇంకా కన్ఫార్మ్ కాలేదని సమాచారం.

కేంద్రంలో ఉన్న బీజేపీని గద్దె దించడానికి జాతీయ పార్టీ సన్నాహల్లో ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పటికే పలువురు నాయకులను కలిశారు. యాంటీ-బీజేపీ శక్తులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొని రావడానికి 'సమ్మాన్ దివస్' ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు విడివిడిగా కలసిన నాయకులందరినీ ఒకే చోట కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. మొదటి నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న కేసీఆర్.. ఆ పార్టీ పాల్గొంటే మాత్రం కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ మమత బెనర్జీ, నారా చంద్రబాబు నాయుడు, అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, ప్రకాశ్ సింగ్ బాదల్, ఫరూక్ అబ్దుల్లా, నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్, దేవెగౌడ, కుమారస్వామి తదితరులకు ఐఎన్ఎల్‌డీ ఆహ్వానాలు పంపింది. కాంగ్రెస్‌కు ఆహ్వానం పంపారా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

బీజేపీయేతర శక్తులన్నీ ఒకే వేదిక మీదకు వస్తుండటంతో ఈ అవకాశాన్ని బలంగా వాడుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. జాతీయ రాజకీయాలతో పాటు ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చ జరగాలని కేసీఆర్ కోరకుంటున్నారు. బీజేపీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను బలంగా ప్రచారం చేయాలని, రాష్ట్రాల హక్కులను హరిస్తున్న తీరును, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎత్తి చూపాలని కేసీఆర్ మొదటి నుంచి వాదిస్తున్నారు. దేశంలోని ముఖ్య నేతలంతా కలిస్తే ఆ కార్యక్రమానికి తప్పకుండా మీడియాలో కూడా మైలేజీ వస్తుంది. ప్రజల్లో మరింత చర్చ జరుగుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అందుకే ఈ నెల 25న హర్యానా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

First Published:  19 Sept 2022 6:37 AM IST
Next Story