ఉజ్వల భవిష్యత్తును వదిలేసి.. ఉన్మాదంలోకి
ఎంతటి శక్తిమంతులనైనా అహింసా వాదంతో ఓడించ వచ్చని, శాంతియుతంగా కూడా ఉద్యమాలు చేయొచ్చని మానవాళికి సందేశమిచ్చిన మహాత్ముడు గాంధీ అని, అలాంటి మహాత్ముడు పుట్టినగడ్డ మన భారతావని అని అన్నారు కేసీఆర్.
భారత్ ను ఉన్మాద స్థితిలోకి నెట్టేసేందుకు కుటిలయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. అద్భుతమైన ప్రకృతి, ఖనిజ సంపద, సమర్థవంతమైన మానవ వనరులు ఉన్నా కూడా దేశం పురోగమించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర వజ్రోత్సవ ద్వసప్తాహ వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్ తన సందేశాన్ని వినిపించారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా.. పేదల ఆశలు ఇంకా నెరవేరలేదని, కొన్ని వర్గాల ప్రజలకు స్వతంత్ర ఫలాలు ఇంకా అందలేదని అన్నారు.
10శాతం మందిలో స్ఫూర్తి రగిలినా చాలు..
స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలు, యువకులకు తెలియజెప్పేందుకే 2 వారాలపాటు వజ్రోత్సవాలు చేపట్టామన్నారు కేసీఆర్. ఎంతటి శక్తిమంతులనైనా అహింసా వాదంతో ఓడించ వచ్చని, శాంతియుతంగా కూడా ఉద్యమాలు చేయొచ్చని మానవాళికి సందేశమిచ్చిన మహాత్ముడు గాంధీ అని, అలాంటి మహాత్ముడు పుట్టినగడ్డ మన భారతావని అని అన్నారు కేసీఆర్. మహాత్ముడి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేసేందుకే 22 లక్షల మంది విద్యార్థులకోసం వివిధ ప్రాంతాల్లో 'గాంధీ' చిత్రాన్ని ప్రదర్శించామని, సినిమా చూసిన వారిలో కనీసం 10 శాతం మందికి స్ఫూర్తి కలిగినా చాలని చెప్పారు.
మనదీ గాంధేయవాదమే..
భారత దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణలో అహింసా సిద్ధాంతంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగిందని, దేశంలోనే తెలంగాణ ప్రత్యేకత సాధించడానికి అదే కారణం అని అన్నారు కేసీఆర్. విభజన తర్వాత అద్భుతంగా పురోగమిస్తున్నాం, స్వతంత్ర భారత వజ్రోత్సవాలను గొప్పగా జరుపుకొన్నాం అని చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ విశ్వమానవుడని, ఆయన గొప్పతనాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని, విదేశాల్లో ఆయన జీవిత విశేషాలు, విగ్రహాలు ఉండటం దేశానికి గర్వకారణం అన్నారు కేసీఆర్. గాంధీమార్గంలో దేశం పురోగమించాలని ఆకాంక్షించారు. తెలంగాణ మహనీయుల వారసులను, వనజీవి రామయ్యను, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఈ సందర్భంగా కేసీఆర్ సత్కరించారు.