నాందేడ్ సభలో భారీ చేరికలు.. కేసీఆర్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే
ముందుగా గురుద్వారా సందర్శన ఉంటుంది. అక్కడ కేసీఆర్ సహా ఇతర నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హింగోలి రోడ్డు ఎదురుగా ఉన్న గురుద్వారా సత్కంద్ బోర్డు మైదాన్ లో బీఆర్‌ఎస్ చేరికల సమావేశం ఉంటుంది.
ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభ భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా చేరికలపై దృష్టి పెట్టారు నేతలు. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీరాజే ఈ సభకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని అంటున్నారు. సీఎం కేసీఆర్ సభ, రోడ్ షో కు అన్ని ఏర్పాట్లు లభించాయి.
సీఎం కేసీఆర్ నాందేడ్ పర్యటన, సభ ఏర్పాట్లను.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, హన్మంత్ షిండే పరిశీలించారు. ఫిబ్రవరి-5 ఉదయం సీఎం కేసీఆర్ నాందేడ్ కు చేరుకున్న అనంతరం ముందుగా గురుద్వారా సందర్శన ఉంటుంది. అక్కడ కేసీఆర్ సహా ఇతర నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హింగోలి రోడ్డు ఎదురుగా ఉన్న గురుద్వారా సత్కంద్ బోర్డు మైదాన్ లో బీఆర్‌ఎస్ చేరికల సమావేశం ఉంటుంది. మధ్యాహ్నానికి ఈ కార్యక్రమం ముగించాలనుకుంటున్నారు. ఇటీవల ఛత్రపతి శివాజీ వారసుడు, బీజేపీ మాజీ ఎంపీ శంభాజీరాజే ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఈ చేరికల కార్యక్రమానికి వస్తారని అంచనా. చేరికల అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సహా ఇతర కీలక నేతల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత నాందేడ్ సిటీ ప్రైడ్ హోటల్ లో మీడియాతో మాట్లాడతారు సీఎం కేసీఆర్. సాయంత్రానికి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు.
వాస్తవానికి ఈనెల 29న నాందేడ్ లో బీఆర్ఎస్ సభ నిర్వహించాలనుకున్నా.. అక్కడి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వాయిదా పడింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి-5న సభకోసం ఏర్పాట్లు చేశారు. చేరికలతో బీఆర్ఎస్ సత్తా చూపించాలనుకుంటున్నారు నేతలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే బీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రకటించారు కేసీఆర్. మహారాష్ట్ర విషయంలో నాందేడ్ సభతో పార్టీ అధ్యక్షుడు ఎవరనే విషయంలో క్లారిటీ వస్తుందంటున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. నాందేడ్ తర్వాత త్వరలో ఏపీలో కూడా బీహార్ఎస్ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నారు.