కేసీఆర్ రియల్ హీరో.. విజన్ అంటే ఆయనదే : వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
రెండేళ్ల సమయంలోనే రూ.650 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ కట్టి చూపించిన తెలంగాణ సీఎం కేసీఆర్ రియల్ హీరో అని వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రశంసించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. మహారాష్ట్రలోని ప్రజలు, రైతులు అయితే.. మాకు కూడా తెలంగాణ పథకాలు కావాలని కోరుతున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ను ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధులు కూడా పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశారు.
రెండేళ్ల సమయంలోనే రూ.650 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ కట్టి చూపించిన తెలంగాణ సీఎం కేసీఆర్ రియల్ హీరో అని ప్రశంసించారు. రైతులు ఇబ్బందులు పడొద్దని సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ కాలంలోనే నిర్మించిన కేసీఆర్.. తాజాగా సెక్రటేరియట్‌ను అద్భుతంగా కట్టడం.. ఆయన విజన్‌కు నిదర్శనమని అన్నారు. ఆయన మా రాష్ట్రానికి సీఎం కాకపోయినా తప్పకుండా పొగుడుతామని చెప్పారు. విజనరీని అని మాజీ సీఎం చంద్రబాబు చెప్పికుంటారు. కానీ ఆయన ఒక డూప్లికేట్ అని మండిపడ్డారు.
ఏపీ విభజన తర్వాత అమరావతిలో రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ పేరుతో రేకుల షెడ్లు వేశారని, వానొస్తే నీళ్లు లోపలకు వస్తాయని.. కనీసం బాత్రూమ్‌లు కూడా లేవని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో సెక్రటేరియట్ పేరుతో రూ.15,000 కోట్లు ఫండింగ్ చేసి.. తాత్కాలిక భవనాలు కట్టారని ఆరోపించారు. ఆయన భవనాల పేరుతో డబ్బులను నీళ్లను భూమిలో పోసినట్లు పోశారని మండిపడ్డారు.
చంద్రబాబు జీవితంలో ఎప్పుడూ ఒరిజనల్ లేదు.. ఆయన బతుకంతా టెంపరరీయే అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వ నిర్మించిన కొత్త సెక్రటేరియట్ చూసి తాను ఎంతో మురిసిపోయానని చెప్పుకొచ్చారు. విజన్ అంటే కేసీఆర్‌దే అని.. ఆయన రియల్ హీరో అని ప్రశంసించారు.