Telugu Global
Telangana

జానారెడ్డి మాట తప్పారు -కేసీఆర్

జానారెడ్డి మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా నాగార్జున సాగర్ కష్టాలు తీరలేదన్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు పోటీలో లేకపోయినా సీఎం అవుతానంటూ ఆయన పెద్ద పెద్ద కలలు కంటున్నారని చెప్పారు.

జానారెడ్డి మాట తప్పారు -కేసీఆర్
X

నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి హాలియాలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. గతంలో నాగార్జున సాగ‌ర్‌ లో ఒక్క డిగ్రీ కాలేజీకి కూడా దిక్కు లేదని, నోముల భ‌గ‌త్ ఎమ్మెల్యే అయ్యాక డిగ్రీ కాలేజీ మంజూరైందని చెప్పారు. హాలియాలో 50 ప‌డ‌క‌ల ఆస్పత్రి కూడా భ‌గ‌త్ వచ్చాకే తెచ్చారని గుర్తు చేశారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రెండు లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయని, 8 నెల‌ల్లో పూర్త‌వుతాయని, తానే వచ్చి ప్రారంభిస్తానని చెప్పారు కేసీఆర్.


జానారెడ్డి మాట తప్పారు..

తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండేళ్లలోనే రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తానని తాను చెబితే.. నాలుగేళ్లయినా ఇవ్వలేరని, ఇస్తే తాను గులాబీ జెండా కప్పుకుని బీఆర్ఎస్ కార్యకర్తలా పనిచేస్తానని జానారెడ్డి అన్నారని గుర్తు చేశారు కేసీఆర్. రెండేళ్లు గడువు పెట్టుకుని ఏడాదిన్నరలోనే రైతులకు 24గంటల కరెంటు సరఫరా చేశామన్నారు. కానీ జానారెడ్డి మాట తప్పారని, గులాబి కండువా కప్పుకోలేదన్నారు కేసీఆర్.

జానారెడ్డి మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా నాగార్జున సాగర్ కష్టాలు తీరలేదన్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు పోటీలో లేకపోయినా సీఎం అవుతానంటూ ఆయన పెద్ద పెద్ద కలలు కంటున్నారని చెప్పారు. ఉప ఎన్నికల్లో జానారెడ్డికి బుద్ధి చెప్పినట్టే, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చారు. నోముల నర్సింహయ్య క‌మ్యూనిస్టు పార్టీ యోధుడని, ఆయన చాలా రోజులు ప్ర‌జా సేవ చేశారని, ఆయన మరణం తర్వాత ఆయ‌న కొడుకు భగత్ కి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామని గుర్తు చేశారు. భగత్ యువకుడు, ఉత్సాహ‌వంతుడు, విద్యావంతుడు, విన‌యం ఉన్న వ్య‌క్తిఅని, అలాంటి వ్య‌క్తి ఎమ్మెల్యే అయితే కులం, మ‌తం లేకుండా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గుతుందన్నారు. భ‌గ‌త్‌ ను గుండెల‌కు హ‌త్తుకుని 80 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలన్నారు కేసీఆర్.

First Published:  14 Nov 2023 6:56 PM IST
Next Story