రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే..
కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే కొనసాగుతుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేపట్టబోతున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఏరియల్ సర్వేలో పాల్గొంటారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కూడా ఉంటారు. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే కొనసాగుతుంది. ఏరియల్ సర్వే చేపట్టే ప్రాంతాలు, హెలికాప్టర్ రూట్ ని అధికారులు ఫైనల్ చేస్తున్నారు.
భారీ వర్షాలు, గోదావరి వరదలతో తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతం తీవ్ర ప్రభావానికి లోనైంది. వరద పోటెత్తడంతో పొలాలు మునిగిపోయాయి, ఇళ్లలోకి నీరు చేరింది, ప్రజలు పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నా.. నేరుగా ఆ ప్రభావాన్ని చూసేందుకు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు సిద్ధమయ్యారు.
భద్రాచలం వద్ద ఇప్పటికీ గోదావరి ఉరకలెత్తుతోంది. 70 అడుగుల మేర భద్రాచలం వద్ద నీటి ప్రవాహం ఉంది. ముంపు మండలాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్నిరకాల వసతి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వరదల వల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాల్లోని వైద్యులు, ఉన్నతాధికారులతో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్యాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.