ఫాక్స్‌కాన్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలు చేసిందా?
హైదరాబాద్ శివారులో భారీ తయారీ యూనిట్ నెలకొల్పడానికి ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది చివరిలోగా ఈ ఫెసిలిటీ ఓపెన్ అయితే.. రాబోయే 10 ఏళ్లలో లక్ష మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. అడుగడుగునా అడ్డు పుల్లలు వేస్తోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సహా.. తెలంగాణ వ్యాప్తంగా ఐటీ, హార్డ్‌వేర్, ఫార్మా, టెక్స్‌టైల్ రంగాలు అభివృద్ధి చేయడానికి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నది. దేశంలోనే యంగ్ స్టేట్‌గా ఉన్న తెలంగాణను ఆదుకోవాల్సిన బీజేపీ ప్రభుత్వం.. ఇక్కడకు వచ్చే ప్రాజెక్టులను కూడా గద్దలా తన్నుకొని పోవడానికి కుటిల ప్రయత్నాలు చేస్తోంది.
యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్‌కు కేటాయించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేసింది. రూ.4,863 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ కనుక హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి ఉంటే.. ఐటీ రంగంలో హైదరాబాద్ మిగిలిన నగరాలన్నింటినీ అధిగమించేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉన్న విభేదాల కారణంగా బీజేపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును బుట్టదాఖలు చేసింది. ఇలాగే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో తెలంగాణకు భాగస్వామ్యం లేకుండా చేసింది. అంతే కాకుండా వరంగల్‌లో ఏర్పాటు చేయాలని భావించిన మెగా టైక్స్‌టైల్ పార్కుకు కేంద్రం పైసా విదిల్చడం లేదు. బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి నత్తనడకన సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ కోసం నిధులు విడుదల చేయడానికి ఇష్టపడటం లేదు. రాష్ట్రం ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. కేంద్రం పట్టించుకోవడం లేదు.
తాజాగా ఫాక్స్‌కాన్ కంపెనీ కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయాలని అనుకున్న మెగా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను తన్నుకొని పోవాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఇటీవల టీ-వర్క్స్ ఫెసిలిటీ ప్రారంభోత్సవానికి ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లీ వచ్చారు. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. హైదరాబాద్ శివారులో భారీ తయారీ యూనిట్ నెలకొల్పడానికి ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది చివరిలోగా ఈ ఫెసిలిటీ ఓపెన్ అయితే.. రాబోయే 10 ఏళ్లలో లక్ష మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ఈ ప్రాజెక్టు ఓకే అయినట్లు ప్రకటించారు.
ఇక్కడే బీజేపీ తమ వక్రబుద్దిని బయటపెట్టింది. కర్ణాటకలో ఇప్పుడు ఎన్నికల హడావిడి నెలకొన్నది. ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లీ బెంగళూరు వెళ్లి ముఖ్యమంత్రి బొమ్మైని కలిసి వచ్చారు. ఆ తర్వాత బెంగళూరులోనే ఫాక్స్‌కాన్ యూనిట్ పెడుతున్నట్లు బొమ్మై ప్రకటించారు. దీంతో అసలు ఫాక్స్‌కాన్ యూనిట్ ఎక్కడ పెట్టనున్నదో అర్థం కాక.. అయోమయ పరిస్థితి నెలకొన్నది. బొమ్మై కావాలనే ఫాక్స్‌కాన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినట్లు చర్చ జరుగుతున్నది.
ఫాక్స్‌కాన్ సంస్థకు ఇప్పటికే తమిళనాడు, ఏపీ, గుజరాత్‌లో యూనిట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్ వాటి కంటే కాస్త పెద్దదే. అంతే కాకుండా ఇక్కడ రోబోటిక్స్, ఏఐకి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉత్పత్తి చేయనున్నారు. దీన్నే హైజాక్ చేద్దామని బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం భావించింది. తమకే ఆ యూనిట్ మంజూరయ్యిందని ప్రకటించింది. దీంతో అప్రమత్తం అయిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఫాక్స్‌కాన్ చైర్మన్‌ను సంప్రదించింది. బీజేపీ ఎక్కడ ఈ ప్రాజెక్టును కూడా తన్నుకొని పోతుందేమో అనే ఆందోళనతో వెంటనే తైపీలోని యంగ్ లీతో మాట్లాడింది.
అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ కొంగరకలాన్‌లోనే ఫాక్స్‌కాన్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌కు చైర్మన్ యంగ్ లీ లేఖ రాశారు. ఈ లేఖతో ఫాక్స్‌కాన్ ప్లాన్స్ ఏమిటో స్పష్టంగా తెలిసిపోయాయి. బీజేపీ ఈ విషయంలో మైండ్ గేమ్ ఆడినట్లు తెలిసిపోతోంది. కావాలనే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేయడానికి ఇంత డ్రామా చేసినట్లు చర్చ జరుగుతున్నది. ఫాక్స్‌కాన్‌ను అడ్డుపెట్టుకొని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలని భావించిన బీజేపీకి ఇది పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పుకోవచ్చు.
కాగా, తెలంగాణ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపుడి చెప్పిన వివరాల మేరకు.. కొంగరకలాన్‌లోని 196 ఎకరాల్లో ఫాక్స్‌కాన్ సంస్థ తయారీ యూనిట్ నెలకొల్పుతున్నారు. 3+3 స్ట్రాటజీలో నిర్మించే ఈ ఫెసిలిటీ.. భవిష్యత్ అవసరాల కోసం కూడా ఉపయోగించనున్నారు. ఇక్కడ ఏఐ, సెమీ కండక్టర్స్, నెక్ట్స్ జెనరేషన్ కమ్యునికేషన్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, డిజిటల్ హెల్త్ ప్రొడక్ట్స్ వంటివి తయారు చేయనున్నారు. కేవలం మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా.. ఇక్కడ ఫాక్స్‌కాన్ ఆర్ అండ్ డీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది.