Telugu Global
Telangana

విదేశీ పెట్టుబడులు.. రేవంత్ ప్రభుత్వం ఆ స్థాయి అందుకోగలదా..?

రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని 13 దేశాల దౌత్యవేత్తలు, ఇతర ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ లోని కుతుబ్‌ షాహీ టూంబ్స్‌ వద్ద వారికి ఆతిథ్యమిచ్చారు.

విదేశీ పెట్టుబడులు.. రేవంత్ ప్రభుత్వం ఆ స్థాయి అందుకోగలదా..?
X

కేసీఆర్ హయాంలో, కేటీఆర్ మంత్రిగా ఉండగా.. తెలంగాణకు విదేశీ పెట్టుబడుల వరద కొనసాగింది. తెలంగాణ ఏర్పాటుకి ముందు, ఆ తర్వాత పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనపడింది. ప్రతి సంవత్సరం విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. పొరుగు రాష్ట్రం ఏపీతో పోల్చి చూస్తే ఏకంగా 10రెట్లు ఎక్కువ పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించింది. అదే సమయంలో ఉపాధి రంగంలో కూడా తెలంగాణ దూసుకుపోయింది. కేటీఆర్ విదేశీ పర్యటనలతో ప్రముఖ కంపెనీలు తెలంగాణకు క్యూ కట్టాయి. ఒప్పందాలు జరిగిన రోజుల వ్యవధిలోనే పనులు మొదలైన పరిస్థితి. మరి ఇప్పుడు ఆ పరిస్థితి కొనసాగుతుందా..? తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత విదేశీ పెట్టుబడుల సంగతేంటి..?


రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని 13 దేశాల దౌత్యవేత్తలు, ఇతర ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ లోని కుతుబ్‌ షాహీ టూంబ్స్‌ వద్ద వారికి ఆతిథ్యమిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి వివరించారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తగిన సూచనలు చేయాలని కోరారు. అన్ని దేశాలతో సత్సంబంధాలకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని చెప్పారాయన.

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రతినిధుల బృందం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమైంది. రాష్ట్రంలో అమెజాన్‌ సంస్థ పెట్టిన పెట్టుబడులు, భవిష్యత్ వ్యాపార విస్తరణ ప్రణాళికల వంటి అంశాలను ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు వివరించారు. అటు ఆరు గ్యారెంటీల అమలుతోపాటు, ఇటు విదేశీ పెట్టుబడులపై కూడా సీఎం రేవంత్ దృష్టి పెట్టారు. అయితే ఈ ప్రయత్నం ఎంతమేరకు సఫలమవుతుందో చూడాలి. పెట్టుబడుల విషయంలో అంతిమంగా గణాంకాలే మాట్లాడతాయి కాబట్టి.. మరో ఆరు నెలల తర్వాత తెలంగాణ నూతన ప్రభుత్వ తొలి ఫలితాల గురించి అంచనా వేయొచ్చు.

First Published:  11 Jan 2024 9:13 AM IST
Next Story