Telugu Global
Telangana

'జయ జయహే తెలంగాణ' పాట కీరవాణికి ఇవ్వొద్దు - సీఎం రేవంత్‌కు లేఖ

'జయ జయహే తెలంగాణ' పాటను అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యక్రమాలలో ఆలపించే విధంగా రూపొందించాలని ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.

జయ జయహే తెలంగాణ పాట కీరవాణికి ఇవ్వొద్దు - సీఎం రేవంత్‌కు లేఖ
X

'జయ జయహే తెలంగాణ' పాటకు కీరవాణిని సంగీతం అందించాలని కోరడం చారిత్రక తప్పిదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ లేఖ రాసింది. తెలంగాణకు చెందిన ఎంతో మంది సంగీత దర్శకులు ఉండగా, వారిని కాదని కీరవాణికి బాధ్యతలు అప్పగించడం సబబుగా లేదని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగీత దర్శకుడు కీరవాణితో భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ' పాటను ప్రకటించిన నేపథ్యంలో ఆ పాటకు సంగీతం అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీరవాణిని కోరారు.

'జయ జయహే తెలంగాణ' పాటను అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యక్రమాలలో ఆలపించే విధంగా రూపొందించాలని ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ఉండడంతో ఆ లోగా పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు వార్తలు వచ్చాయి.

కాగా, తెలంగాణ రాష్ట్ర గీతానికి కీరవాణి సంగీతం అందించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ పాటకు సంగీతం అందించడానికి తెలంగాణకు చెందిన సంగీత దర్శకులు ఎంతోమంది ఉండగా కీరవాణినే ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు.

'జయ జయహే తెలంగాణ' పాటకు కీరవాణిని సంగీతం అందించాలని కోరడం చారిత్రక తప్పిదం అవుతుందని ఆ లేఖలో విన్నవించారు. 'మన ఉద్యోగాలు మనకే రావాలని, మన అవకాశాలు మనకే కావాలన్న నినాదంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వారు పాడటం సమంజసం కాదు. అలా చేయడం అంటే తెలంగాణ కళాకారులను అవమానించడమే. ఈ గొప్ప అవకాశం మనవాళ్ళకే ఇవ్వాలి' అని లేఖ ద్వారా కోరారు.

First Published:  25 May 2024 8:03 PM IST
Next Story