14 ఏళ్ల తర్వాత కూడా వెంటాడిన నేరం.. బ్యాంకులో కోట్లు కొట్టేసిన కేసులో ఇద్దరు ఉద్యోగులు అరెస్ట్
కూకట్‌పల్లిలోని కన్యకా పరమేశ్వరీ కోఆపరేటివ్ బ్యాంకులో కోట్ల రూపాయలు కొల్లగొట్టారంటూ లిక్విడేటర్ అన్నపూర్ణ 2009 అక్టోబర్ 1న సీఐడీకి ఫిర్యాదు చేశారు.
వారు బ్యాంకు ఉద్యోగులు. పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశారు. వారితో బ్యాంకు డైరెక్టర్లు కూడా కుమ్మక్కయ్యారు. వీరంతా కలిసి మొత్తం రూ.2 కోట్ల 86 లక్షల బ్యాంకు సొమ్ము కొల్లగొట్టారు. కూకట్‌పల్లిలోని కన్యకా పరమేశ్వరీ కోఆపరేటివ్ బ్యాంకులో ఈ ఉదంతం చోటుచేసుకుంది. 2009లోనే దీనిపై ఫిర్యాదు అందగా, నిందితుల్లో కాకర్లపూడి కృష్ణవర్మ, కాకర్లపూడి పద్మ అలియాస్ రూప మాత్రం అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్నారు. 14 ఏళ్ల తర్వాత వారిని అరెస్ట్ చేసినట్టు సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ సోమవారం వెల్లడించారు.
2009లోనే సీఐడీకి ఫిర్యాదు..
కూకట్‌పల్లిలోని కన్యకా పరమేశ్వరీ కోఆపరేటివ్ బ్యాంకులో కోట్ల రూపాయలు కొల్లగొట్టారంటూ లిక్విడేటర్ అన్నపూర్ణ 2009 అక్టోబర్ 1న సీఐడీకి ఫిర్యాదు చేశారు. సేవింగ్స్ ఖాతాదారులకు రుణాలు మంజూరు చేసినట్టు తప్పుడు రికార్డులు సృష్టించి, ఆ సొమ్మును తమ సొంత ఖాతాల్లోకి మళ్లించినట్టు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ 2015లో అభియోగపత్రం దాఖలు చేసింది.
14 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతూ..
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బ్యాంకు ఉద్యోగులైన నిందితులు కాకర్లపూడి కృష్ణవర్మ, కాకర్లపూడి పద్మ అలియాస్ రూప మాత్రం తప్పించుకొని తిరుగుతున్నారు. పాత కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టిన సీఐడీ ఈ నిందితులను పట్టుకునేందుకు ఏసీపీ గంగాధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది. కృష్ణవర్మ, రూపలు విశాఖపట్నంలోని గాజువాకకు సమీపంలో గల సిద్ధార్థనగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. వీరి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు ఆదివారం హైదరాబాద్‌కు రావడాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
*