Telugu Global
Telangana

ఎన్నికలకు అంతా సిద్ధం.. రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే..

తెలంగాణలో మొత్తం 3 కోట్ల 30 లక్షల మంది ఓటర్లు ఉంటే.. 8 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారని చెప్పారు సీఈవో వికాస్ రాజ్‌.

ఎన్నికలకు అంతా సిద్ధం.. రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే..
X

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్‌ ఉపఎన్నిక కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్‌ రాజ్‌. ఇప్పటికే సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తయిందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో 90 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. లక్షా 80 వేల మంది సిబ్బంది అవసరమని చెప్పారు.

తెలంగాణలో 85 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య లక్షా 85 వేలుగా ఉందన్నారు. ఇంటి నుంచే ఓటు వేయాలనుకునే దివ్యాంగులు, వృద్ధులు ఏప్రిల్‌ 22 వరకు పోస్టల్ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సీఈవో. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 లక్షల 9 వేల మందికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పించామన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం ప్రారంభమవుతుందన్నారు.

తెలంగాణలో మొత్తం 3 కోట్ల 30 లక్షల మంది ఓటర్లు ఉంటే.. 8 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారని చెప్పారు సీఈవో వికాస్ రాజ్‌. తెలంగాణలో అతి చిన్న పార్లమెంట్ మహబూబాబాద్‌ కాగా..అతిపెద్ద పార్లమెంట్ మల్కాజ్‌గిరి అని చెప్పారు. ఇప్పటికే ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని.. రిజర్వ్‌లో కూడా కొన్ని ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక రాష్ట్రంలో 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 50 వేల కంటే ఎక్కువ నగదు తరలిస్తే కచ్చితంగా సంబంధిత పేపర్‌లు చూపించాలన్నారు. లేకుంటే నగదు సీజ్ చేస్తామన్నారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌ స్పీకర్‌లకు అనుమతి లేదన్నారు సీఈవో. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్ జరుగుతుందన్నారు.

First Published:  18 March 2024 5:44 PM IST
Next Story