ఇవాళ టీ.కేబినెట్ భేటీ.. కీలక అంశాలివే!
సమావేశంలో ప్రధానంగా రైతు రుణమాఫీ అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది. ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేసి తీరాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి.
ఎన్నికలు ముగిసిపోవడంతో రేవంత్ సర్కార్ ఇక పాలనపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చివరగా తెలంగాణ కేబినెట్ మార్చి 12న సమావేశమైంది. ఇక ఇవాల్టి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం.
ప్రస్తుతం కోడ్ అమల్లో ఉండడంతో కేబినెట్ భేటీకి అనుమతి కోరుతూ ఇప్పటికే సీఈవో వికాస్‌రాజ్‌కు లేఖ రాసింది రేవంత్ సర్కార్. అయితే ఇప్పటివరకూ ఈసీ నుంచి అనుమతి రాలేదని తెలుస్తోంది. పర్మిషన్ వస్తుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. సమావేశంలో ప్రధానంగా రైతు రుణమాఫీ అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది. ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేసి తీరాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. నిధుల సమీకరణకు అవసరమైన మార్గాలను అన్వేషించాలని సూచించారు.
వీటితో పాటు జూన్ 2 నాటికి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కానుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కాలపరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని అంశాలపైనా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఖరీఫ్ ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు అంశాలు చర్చకు వస్తాయని తెలుస్తోంది.